August 15th Movies: ఈ వారం థియేటర్లలో ఆడియన్స్కు పండుగే.. ఆగస్ట్ 15కి బాక్సాఫీస్ బరిలో 7 సినిమాలు..

August 15th Movies: ఈ వారం థియేటర్లలో ఆడియన్స్కు పండుగే.. ఆగస్ట్ 15కి బాక్సాఫీస్ బరిలో 7 సినిమాలు..

స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 15, 2026) సందర్భంగా సినిమాల సందడి మొదలైంది. ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా విభిన్న కథాంశాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్, లవ్, విలేజ్ కామెడీ, థ్రిల్లర్, ఎమోషన్.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేకతతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.

మరి ఈ వారం థియేటర్లలోకి వస్తున్న ఆ సినిమాలేంటి? ఏ సినిమా ఏ జానర్‌లో తెరకెక్కింది? ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలేంటి? బాక్సాఫీస్ వద్ద ఏ మూవీ సత్తా చాటనుందనే ఆసక్తి నెలకొంది. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం..

విశ్వనాథ్ & సన్స్ (Vishwanath & Sons) - ఆగస్ట్ 14  

‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి నుంచి వస్తున్న ప్రయోగాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో సూర్య అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించదగ్గ షార్ప్‌షూటర్ ‘సంజయ్ విశ్వనాథ్’ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు, ఆయనకంటే చాలా చిన్న వయసు గల అభిమాని ‘మ్యాడీ’(మమితా బైజు) మధ్య జరిగే అసాధారణమైన ప్రేమకథ, నవ్వులు పూయించే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన బలం. రొమాన్స్, హ్యూమర్, స్పోర్ట్స్ డ్రామా అంశాల సమ్మిళితంగా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.  

పళ్ళ బురుసు (Palla Burusu) - ఆగస్టు 14 

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న నాచురల్ విలేజ్ ఎంటర్‌టైనర్ ఇది. వేపపుల్లతో పళ్లు తోముకోలేక పంటి నొప్పితో బాధపడుతున్న ఒక వృద్ధ తండ్రి, తన కొడుకును ఒక ‘టూత్ బ్రష్’ కొనివ్వమని అడగడంతో మొదలైన చిన్న కోరిక.. చివరకు జిల్లా కోర్టు మెట్లు ఎక్కేంత పెద్ద గందరగోళానికి ఎలా దారితీసిందనే వినూత్న పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. గ్రామీణ నేపథ్యం, తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగాలు, కడుపుబ్బా నవ్విచే కామెడీ ఈ చిత్రానికి హైలైట్ నిలవనున్నాయి. కొత్త దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు. 

 అగధ (Agadha) - ఆగస్టు 14 

స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ M.S రాజు దర్శకత్వంలో వస్తున్న మిస్టిక్, డివైన్ థ్రిల్లర్ చిత్రం ‘అగధ’. వరుస విషాదకర మరణాలు, కజిన్ రహస్య ఆత్మహత్య నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. రహస్యాలతో కూడిన ఒక అడవి గుహ నేపథ్యంలో, ఊహకందని అతీంద్రియ శక్తుల అన్వేషణ చుట్టూ తిరిగే ఈ కథ థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. 

మకుటం (Makutam) - ఆగస్టు 14 

మాస్ యాక్షన్ హీరో విశాల్ పూర్తి స్థాయిలో మెగాఫోన్ పట్టి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మకుటం’. ప్రశాంతంగా బతకాలనుకున్న ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని నమ్మకద్రోహం ఎలా మార్చింది? హింసాత్మక వారసత్వాన్ని మోస్తూ తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అనే డ్రామాతో ఈ చిత్రం సాగుతుంది. మూడు విభిన్న గెటప్‌లలో విశాల్ విశ్వరూపం, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లనున్నాయని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ALSO READ : వీళ్లిద్దరిలో ఎవరు ఆనందంగా ఉంటారు

బట్వారా 1947- ఆగస్టు 14న 

స్వాతంత్య్ర సమరానంతరం జరిగిన దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'బట్వారా 1947' .  సన్నీ డియోల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై  ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి రూపొందించిన ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించారు. 1947 దేశ విభజన సమయంలో జరిగిన మత ఘర్షణలు, వలసలు, కుటుంబాల విషాద గాథను ఈ సినిమా హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించనుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, జావేద్ అఖ్తర్ సాహిత్యం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆవారాపన్ 2 (Awarapan 2)- ఆగస్టు 14 

2007లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఆవారాపన్'కు సీక్వెల్‌గా వస్తున్న యాక్షన్ క్రైమ్ రొమాంటిక్ డ్రామా ఇది. ఇమ్రాన్ హష్మీ, దిశా పటాని హీరోహీరోయిన్లుగా నటించారు. షబానా ఆజ్మీదర్శకత్వం తెరకెక్కించిన ఈ మూవీ ప్రేమ, త్యాగం మరియు ప్రతీకారం చుట్టూ కథ నడుస్తుంది. 

హుషారు పిట్టలు (Husharu Pittalu) - ఆగస్ట్ 15  

స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 15) పబ్లిక్ హాలిడే కానుకగా యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్ ‘హుషారు పిట్టలు’. ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్న ఈ చిత్రం లవ్, ఫ్రెండ్ షిప్, కామెడీ మరియు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న బలమైన భావోద్వేగాల కలయికగా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

స్టార్ హీరోల భారీ చిత్రాల నుంచి విభిన్నమైన కాన్సెప్ట్ ఉన్న రూరల్ డ్రామాలు, థ్రిల్లర్లు మరియు యూత్‌ఫుల్ మూవీస్‌ వరకు అన్నీ ఒకేసారి వస్తుండటంతో ఈ వారం థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతూ బాక్సాఫీస్‌కు ఈ చిత్రాలు అద్భుతమైన బూస్ట్ ఇవ్వడం ఖాయం!