ఫిఫా వరల్డ్ కప్ 2026లో సంచలనం నమోదైంది. ఫిఫా వరల్డ్ కప్ మాజీ ఛాంపియన్ జర్మనీ నాకౌట్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా పరాగ్వేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో జర్మనీ 3-4 తేడాతో ఓటమి పాలైంది. 140 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన జర్మనీ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ ఓటమితో జర్మనీ ఇంటి బాట పట్టింది.
పరాగ్వే వర్సెస్ జర్మనీ మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందని సగటు ఫుట్ బాల్ అభిమానులు భావించారు. కానీ వారి అంచనాలను పరాగ్వే పటాపంచలు చేస్తూ బలమైన జర్మనీని చిత్తు చేసి టోర్నీ నుంచి ఇంటికి పంపింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పరాగ్వే 4-3 తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది.
ఫస్టాఫ్‌లో పరాగ్వే అదుర్స్
అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన పరాగ్వే ఫస్టాఫ్‌లోనే మాజీ చాంప్ జర్మనీకి ఊహించని షాక్ ఇచ్చింది. మ్యాచ్ 42వ నిమిషంలో జూలియో ఎన్సిసో పరాగ్వేకు తొలి గోల్ అందించాడు. మాటియాస్ గలార్జా అందించిన క్రాస్‌ను జూలియో ఎన్సిసో హెడర్‌తో గోల్‌గా మలిచాడు. జర్మనీ అటాకింగ్‌ను కూడా పరాగ్వే వ్యూహత్మకంగా నిలువరించింది. జర్మన్లు పదే పదే పరాగ్వే గోల్ పోస్ట్‌పై దాడులు చేయగా పరాగ్వే కట్టుదిట్టంగా అడ్డుకుంది. దీంతో ఫస్టాఫ్ ముగిసేసరికి జర్మనీ 1-0తో వెనుకబడింది.
సెకండాఫ్‌లో జర్మనీ కంబ్యాక్
తొలి అర్ధభాగంలో వెనకబడ్డ మాజీ చాంపియన్ సెకండాఫ్ లో తిరిగి బలంగా పుంజుకుంది. రెండవ అర్ధభాగంలో ఆట తిరిగి ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకే జర్మనీ గోల్ చేసి చేసింది. జర్మనీ స్టార్ కై హావర్ట్జ్ అద్భుతమైన హెడర్ గోల్‌తో స్కోర్‌ను 1-1 సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి.
కానీ నిర్ణీత సమయంలో మరో గోల్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ అదునపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలో జొనాథన్ తాహ్ చేసిన గోల్‌ను వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష చేసి ఫౌల్ కారణంగా రద్దు చేశారు. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది.
పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే 4-3 తేడాతో జర్మనీపై చారిత్రాత్మక విజయం సాధించింది. షూటౌట్‌లో పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్ అడ్డుగోడగా నిలబడి తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. ఈ ఊహించని ఓటమితో టోర్నీలో మాజీ చాంపియన్ జర్మనీ ప్రయాణం ముగిసింది. జూలై 4న ఫిలడెల్ఫియాలో జరిగే రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా ఫ్రాన్స్ లేదా స్వీడన్‌తో పరాగ్వే తలపడనుంది.
