కుమ్రంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మూడు పులులు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సిర్పూర్ (టి) మండలం ఇటిక్యాల్ పహడ్ అటవీ ప్రాంతంలో రెండు పులులు జోరుగా సంచరిస్తున్నాయి. ఇవి తరచూ స్థానిక ప్రజల కంటికి కనిపిస్తుండటంతో జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక మరోవైపు, కాగజ్‌నగర్ మండలం అంకుశపూర్ అటవీ ప్రాంతంలో ఇంకొక పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మహారాష్ట్రలోని తడోబా పులుల అభయారణ్యం నుండి ఈ పులులు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పులుల సంచారంతో పశువుల కాపరులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు, మేకలను మేపడానికి అడవుల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు.
ప్రస్తుతం అటవీ అధికారులు, ట్రాకర్ల సాయంతో ఆ పులుల కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. అటవీ ప్రాంత పరిసరాల ప్రజలు, పశువుల కాపరులు ఒంటరిగా అడవుల్లోకి వెళ్లొద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
