Shashank Singh: ఐపీఎల్ (IPL) లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి.. రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి శైలేష్ సింగ్లు వివాదంలో చిక్కుకున్నారు. తమ ఇంట్లో పని చేసే వంటమనిషిపై దాడి చేసి, అసభ్యకర పదజాలంతో దూషించారనే ఆరోపణలపై వీరిద్దరితో పాటు వారి డ్రైవర్పై భోపాల్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ భోపాల్లోని రతీబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం:
బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ ఇటీవల భోపాల్కు వచ్చి, నెలకు రూ.15 వేల జీతంతో క్రికెటర్ శశాంక్ సింగ్ ఇంట్లో వంటమనిషిగా చేరాడు. పనిలో చేరే సమయంలో అతనికి ఉచిత భోజనం, వసతి కల్పించడంతో పాటు భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పిస్తామని శశాంక్ కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది గంటల్లోనే శశాంక్ కుటుంబం తనపై తీవ్ర మానసిక ఒత్తిడి (Mental Stress) తీసుకురావడం ప్రారంభించారని విపేంద్ర ఆరోపించాడు. వండిన వంటకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, దురుసుగా ప్రవర్తిస్తూ తనను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
రూమ్ తలుపులు బద్దలు కొట్టి మరీ దాడి:
ఈ టార్చర్ను భరించలేక తాను ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పడంతో శశాంక్ సింగ్, అతని తండ్రి శైలేష్ సింగ్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నేను బయటి వాళ్లతో మాట్లాడకుండా, హెల్ప్ అడగకుండా మొబైల్ ఫోన్ను బలవంతంగా లాక్కుని బంధించారు.. వారి ప్రవర్తనతో తీవ్ర భయాందోళనకు గురై.. ప్రాణభయంతో ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాను.. అయినా వదలకుండా క్రికెటర్ శశాంక్ సింగ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్, వారి డ్రైవర్ ముగ్గురూ కలిసి ఆ గది తలుపులను బద్దలు కొట్టి.. లోపలికి వచ్చి నాపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారని బాధితుడు విపేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మెడికల్ రిపోర్ట్స్లో గాయాలు:
బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన రతీబాద్ పోలీసులు అతనికి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య పరీక్షలు (Medical Examination) నిర్వహించారు. ఈ మెడికల్ రిపోర్ట్సుల్లో బాధితుడి ముఖం, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కావడంతో కేసు తీవ్రతను బట్టి పోలీసులు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు.
