కుటుంబ గొడవల్లో నలుగురి హత్య, ఇద్దరి ఆత్మహత్య..జగిత్యాల జిల్లాలో భార్యను చంపి భర్త సూసైడ్

కుటుంబ గొడవల్లో నలుగురి హత్య, ఇద్దరి ఆత్మహత్య..జగిత్యాల జిల్లాలో భార్యను చంపి భర్త సూసైడ్
  • యాదాద్రి జిల్లాలో తల్లిని చంపి ఆత్మహత్య చేసుకున్న కొడుకు
  • భూపాలపల్లి జిల్లాలో భార్యను చంపిన భర్త
  • మంచిర్యాల జిల్లాలో మరో వ్యక్తి మర్డర్

కుటుంబ గొడవల్లో సోమవారం నలుగురిని హత్య మార్చగా, మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక చోట భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకోగా, మరోచోట భర్త చేతిలో భార్య హతమైంది. ఇంకో చోట తల్లిని చంపి కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. మరో జిల్లాలో ఫోన్ విషయంలో తలెత్తిన గొడవ వ్యక్తి హత్యకు దారి తీసింది.

జగిత్యాల జిల్లా భార్య హత్య, భర్త ఆత్మహత్య

మల్యాల, వెలుగు : ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓలపు నాగరాజు (47), లక్ష్మీ (43) దంపతులు. వీరికి పిల్లలు లేకపోవడంతో మూడేండ్ల కింద రియాన్స్ అనే బాలుడిని దత్తత తీసుకున్నారు. సొంత పిల్లలు లేరన్న బెంగతో నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

 ఆదివారం రాత్రి సైతం మరోసారి గొడవ జరగడంతో నాగరాజు తన వెంట తెచ్చుకున్న గడ్డి మందు తాగేందుకు ప్రయత్నించాడు. గమనించిన లక్ష్మీ వారించడంతో ఆగ్రహానికి గురైన నాగరాజు టవల్ తో లక్ష్మీని హత్య చేసిన అనంతరం తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం నిద్ర లేచిన రియాన్స్ కు తల్లిదండ్రులిద్దరూ విగతజీవులుగా కనిపించడంతో స్థానికులకు విషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ రాజ్ కుమార్, ఎస్సై సందీప్ వివరాలు సేకరించారు. 

పోచంపల్లిలో తల్లిని చంపి కొడుకు..

భూదాన్ పోచంపల్లి వెలుగు : మద్యం మత్తులో ఓ వ్యక్తి తన తల్లిని హత్య చేసి, తానూ   ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన సంఘం పోచమ్మ (63)కు ముగ్గురు కొడుకులు. చిన్నవాడైన శ్రీనివాస్ (46) హైదారాబాద్ లోని చింతల్ ఉంటున్నాడు. ఆర్టీసీ డ్రైవర్​అయిన శ్రీనివాస్​(46)కు గతేడాది వెన్నుపూసకు ఆపరేషన్​కావడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. 

ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం భార్యతో కలిసి పెద్దరావులపల్లికి వచ్చాడు. మద్యం మత్తులో భార్యతో గొడవ జరగడంతో ఆమెను కొట్టగా తీవ్రంగా గాయపడింది. వెంటనే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్న అనంతరం చింతల్ వెళ్లిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ కు తల్లి పోచమ్మతో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్​బండరాయితో కొట్టి తల్లిని హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం వరకూ ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులు కిటికీలోంచి చూడగా... రక్తపు మడుగులో పోచమ్మ, ఉరి వేసుకొని శ్రీనివాస్ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

కాటారం మండలం భార్యను చంపిన భర్త

మహాదేవపూర్, వెలుగు: భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఇబ్రహీంపల్లికి చెందిన సతీశ్ కు మహారాష్ట్రలోని సిరోంచకు చెందిన రజిత (36)తో 15 ఏండ్ల కింద వివాహమైంది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రజిత నిద్రలో ఉండగా.. సతీశ్ గొడ్డలితో నరికి హత్య చేసి పారిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.  

ప్రాణాలు తీసిన మొబైల్ గొడవ

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో కుటుంబకలహాలు, మొబైల్ కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గ్రామానికి చెందిన గజ్జి వెంకటేశ్​అలియాస్ స్వామి (40), డ్రైవర్ గా పనిచేసే రాజ్​కుమార్​సమీప బంధువులు. రాజ్​కుమార్ ఆరేండ్ల కింద వెంకటేశ్ మేనకోడలిని వివాహం చేసుకుంటానని చెప్పి తర్వాత తప్పుకోవడంతో.. పెద్దలు కల్పించుకొని ఇద్దరికీ వివాహం చేశారు. 

వెంకటేశ్ జోక్యంతోనే తన పెండ్లి చేశారని రాజ్​కుమార్​ కక్షపెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ మొబైల్ విషయంలో ఆదివారం రాత్రి వెంకటేశ్, రాజ్ కుమార్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజ్ కుమార్ సిమెంట్ రాయితో వెంకటేశ్ తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్ ను మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.