రాహుల్ గాంధీపై కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు: ఆయన అన్నదాంట్లో తప్పులేదని వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు: ఆయన అన్నదాంట్లో తప్పులేదని వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. హిందుత్వ సిద్ధాంతకర్త, ఫ్రీడమ్ ఫైటర్ వినాయక్ దామోదర్ వీర్ సావర్కర్‏పై వివాదస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ పరువు నష్టం దావాను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసు కొనసాగించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అనుమతి పొందలేదని కోర్టు స్పష్టం చేసింది.

వివాదం ఏంటంటే..?

2022లో మహారాష్ట్రలో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ వీర్ సావర్కర్‏పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. సావర్కర్‌ బ్రిటిష్‌ వారికి సేవకుడిగా వ్యవహరించాడని.. బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి అతను పెన్షన్‌ తీసుకునేవారని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై న్యాయవాది నృపేంద్ర పాండే లక్నో దిగువ కోర్టును ఆశ్రయించారు.

 రాహుల్‌ వ్యాఖ్యలు సావర్కర్‎కు పరువు నష్టం కలిగించడంతో పాటు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ప్రాథమికంగా కేసు విచారణకు అర్హమైనదేనని భావించింది. ఈ మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని 153ఏ, 505 సెక్షన్ల కింద రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. ట్రయల్ కోర్టు సమన్లను రాహుల్ గాంధీ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. రాహుల్ పిటిషన్‎పై శుక్రవారం (ఆగస్ట్ 14) జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సావర్కర్‏పై వివాదస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ పరువు నష్టం దావా, ట్రయల్ కోర్టు సమన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సెక్షన్ల కింద కేసు కొనసాగించేందుకు అవసరమైన ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే క్రిమినల్ ప్రొసిడింగ్స్ మొత్తం రద్దు చేసింది. దీంతో రాహుల్ గాంధీకి భారీ ఊరట దక్కింది.