ఉద్ధవ్ థాక్రే మరో బిగ్ షాక్.. షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్సీ సచిన్

ఉద్ధవ్ థాక్రే మరో బిగ్ షాక్.. షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్సీ సచిన్

ముంబై: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ టైగర్‏లో భాగంగా ఇప్పటికే ఆరుగురు ఎంపీలు ఉద్ధవ్ వర్గానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా ఎమ్మెల్సీ సచిన్ అహిర్ డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరారు. షిండే వర్గంలో చేరిన వెంటనే మహారాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి శివసేన అభ్యర్థిగా సచిన్ అహిర్ నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా, ఒక్కో నేత వరుసగా జంప్ అవుతుండటంతో క్రమంగా ఉద్ధవ్ వర్గం ఖాళీ అవుతోంది. వరుస ఫిరాయింపులతో ఉద్ధవ్ థాక్రే సతమతమవుతున్నారు. 

ఆరుగురు ఎంపీలు జంప్

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి  చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్ష శివసేన(యూబీటీ) ఎంపీల సంఖ్యా బలం భారీగా పడిపోయింది. ఇటీవల ఢిల్లీలో ఉద్ధవ్ థాక్రే తన పార్టీ ఎంపీలతో ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారు. 

శివసేన (యూబీటీ)కి మొత్తం 9 మంది లోక్‌సభ ఎంపీలుండగా..ఉద్ధవ్ థాక్రే నిర్వహించిన మీటింగ్‌కు మాత్రం కేవలం ముగ్గురు ఎంపీలే అటెండ్ అయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీలు రాకుండా డుమ్మా కొట్టారు. అప్పుడే వీరంతా పార్టీ మారబోతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఊహించినట్లుగానే, ఆ ఆరుగురు ఎంపీలు సోమవారం ఏకనాథ్ షిండే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. 

చట్టపరంగా ఇబ్బంది రాదా..?

మన దేశంలో 'ఫిరాయింపుల నిరోధక చట్టం' ప్రకారం.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచిన పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు తమ పదవులు ఊడిపోకుండా ఉండాలంటే, ఆ పార్టీకి ఉన్న మొత్తం సభ్యుల్లో కనీసం మూడింట రెండు వంతుల మంది (2/3) కలిసి రావాలి. లేదంటే వారి పదవులు ఊడిపోతాయి. ఉద్ధవ్ థాక్రే పార్టీకి ఉన్న 9 మంది ఎంపీల్లో కరెక్ట్‌గా ఆరుగురు (2/3 వంతు) షిండే వైపు వచ్చారు. అందువల్ల వీరిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. దాంతో ఈ ఫిరాయింపుకు పూర్తి చట్టబద్ధత లభించనట్లయింది.