హైదరాబాద్‌కు తరలిస్తుండగా సీజ్.. భువనగిరిలో రూ.3.22 కోట్ల గంజాయిని తగులబెట్టిన రైల్వే పోలీసులు

హైదరాబాద్‌కు తరలిస్తుండగా సీజ్.. భువనగిరిలో రూ.3.22 కోట్ల గంజాయిని తగులబెట్టిన రైల్వే పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో రైల్వే పోలీసులు భారీ మొత్తంలో పట్టుబడిన గంజాయిని ధ్వంసం చేశారు. భువనగిరి పరిధిలోని తుక్కపురంలో గల రోమో ఇండస్ట్రీస్‌లో దాదాపు 735 కిలోల గంజాయిని అధికారులు పూర్తిగా తగులబెట్టారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.3.22 కోట్లు ఉంటుందని అంచనా.

పలు రాష్ట్రాల నుంచి  హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయిని రైల్వే పోలీసులు వేర్వేరు సమయాల్లో పట్టుకున్నారు. దీనిపై సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర, ఒడిశా సహా పలు ఇతర ప్రాంతాల నుంచి ఈ గంజాయి రవాణా అవుతోందని తెలిపారు.

మొత్తంగా సికింద్రాబాద్ అర్బన్, రూరల్ డివిజన్లకు చెందిన 35 కేసులు, అలాగే కాజీపేట డివిజన్ పరిధిలోని 16 కేసులకు సంబంధించిన గంజాయిని సేకరించి.. మొత్తం 51 కేసుల ముడిసరుకును ఈ ప్రక్రియలో పూర్తిగా నాశనం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా గంజాయి నిర్మూలన చర్యల్లో రైల్వే పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటామని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.