సూర్యపేట జిల్లా తిమ్మాపురం పాల సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత

సూర్యపేట జిల్లా తిమ్మాపురం పాల సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత

తుంగతుర్తి,  వెలుగు:  జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ పాల సొసైటీ ఎన్నికలు సోమవారం ఉద్రిక్త వాతావరణం మధ్య కొనసాగగా, కౌంటింగ్ మాత్రం రేపటికి వాయిదా పడింది. సొసైటీలో మొత్తం 56 మంది పాడి రైతులకు సభ్యత్వ ఓటు ఉండగా, అందులో 55 మంది పాడి రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య చిన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

పోస్టల్ బ్యాలెట్ విషయంలో వివాదం తీవ్రతరం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎన్నికలను సజావుగా జరిపించినా, కౌంటింగ్ సమయానికి కౌంటింగ్ ఏజెంట్లు రాకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి మల్లయ్య తెలిపారు. సిఐ నాగేశ్వరరావు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్  నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీసులు గ్రామానికి చేరుకొని శాంతిభద్రతల దృష్ట్యా ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.