రవితేజ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆగస్టు 21న మూవీ గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘ఇరుముడి కట్టు’ పేరుతో విడుదలైన ఈ పాట భక్తి, ఆట, పాటతో హుషారుగా సాగింది.
అయ్యప్ప మాలలో కనిపించిన రవితేజ స్వామివారి భక్తుడిగా ఆకట్టుకునేలా చిందులేశాడు. ఈ ‘ఇరుముడి కట్టు’ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. జి వి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటను డైరెక్టర్ శివ నిర్వాణతో పాటుగా లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి రాశారు. అనంతు హుషారైన గొంతుతో పాడారు.
‘‘మండలి దీక్ష ముగిసింది.. మాలకి అర్ధం తెలిసింది.. శబరికొండ పిలిచింది.. మణికంఠుని చేరగా పదిమంది..’’ ‘‘హే కట్టు కట్టు.. ఇరుముడి కట్టు.. ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు’’ అనే లిరిక్స్ భక్తితో చిందులేసే విధంగా ఉన్నాయి.
ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ ‘ఇరుముడి’ సినిమా మలయాళ హిట్ సినిమా ‘మాలికాపురం’ రీమేక్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఈ ప్రచారాన్ని ‘ఇరుముడి’ సినిమా మేకర్స్ ఖండించలేదు. రీమేక్ అని కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పటికి అయితే ప్రస్తుతానికి ఇది పుకారు మాత్రమే.
