స్కూళ్లలో మూడు భాషల విధానం (Three-Language Formula) అమల్లోకి తెస్తున్నట్లు సీబీఎస్‌ఈ (CBSE) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆందోళనల నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే క్లారిటీ ఇచ్చింది.
అసలు విషయం ఏంటంటే?
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త విద్యా విధానం ప్రకారం.. 9వ తరగతి విద్యార్థులు కచ్చితంగా మూడు భాషలు చదవాలి. అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ఉదాహరణకు తెలుగు, హిందీ లేదా సంస్కృతం లాంటివి.
కానీ, పట్టణ ప్రాంతాల్లోని కొంతమంది విద్యార్థులు ఇంతకుముందు రెండు విదేశీ భాషలను (ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటివి) సబ్జెక్టులుగా చదవాలి. కానీ కొత్త రూల్ ప్రకారం వీరు ఒక విదేశీ భాషను తీసేసి.. భారతీయ భాషను తీసుకోవాల్సి వచ్చేది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవడమే కాకుండా, సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
విదేశీ భాషలు చదివే విద్యార్థులకు దక్కిన రిలీఫ్:
పాత సబ్జెక్టులతోనే కంటిన్యూ అవ్వొచ్చు: ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో రెండు విదేశీ భాషలను తీసుకొని చదువుతున్న విద్యార్థులు, 10వ తరగతి (Class X) పూర్తయ్యే వరకు అవే విదేశీ భాషలతో కొనసాగడానికి CBSE అనుమతించింది. వారు ఇప్పుడు భారతీయ భాషల్లోకి మారాల్సిన అవసరం లేదు.
కొత్త రూల్ ఎవరికి వర్తిస్తుంది:
కనీసం రెండు భారతీయ భాషలు చదవాలనే నిబంధన భవిష్యత్తులో 6వ తరగతిలోకి (Class VI) ప్రవేశించే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో ఉన్నవారికి ఈ రూల్ ఉండదు.
కేవలం 1.5% విద్యార్థుల కోసమే ఈ మినహాయింపు:
CBSE వ్యాప్తంగా ఉన్న విద్యార్థులలో దాదాపు 98.5% మంది ఇప్పటికే మూడు భాషల సూత్రాన్ని (భారతీయ భాషలతో) పాటిస్తున్నారు. మెట్రో సిటీల్లో ఉంటూ, రెండు విదేశీ భాషలను చదువుతున్న కేవలం 1.5% మంది విద్యార్థుల కోసమే ఈ ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు.
వెనక్కి తగ్గడం కాదు.. క్లారిటీ
"మేము పాలసీని వెనక్కి తీసుకోలేదు. పాత నిబంధనలోనే కొద్దిగా గందరగోళం ఉంది, దానికి ఇప్పుడు స్పష్టత ఇచ్చామంతే" అని విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. మొత్తానికి, ఇప్పటికే విదేశీ భాషలను కెరీర్ ఆప్షన్‌గా తీసుకొని చదువుకుంటున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ నిర్ణయంతో పెద్ద ఊరట లభించింది.
