భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సినిమా స్టైల్‌లో ఓ కారు చోరీ కలకలం రేపింది. కళ్లెదుటే.. కనురెప్ప మూసి తెరిచేలోపు రోడ్డు పక్కన ఆపిన కారును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన దమ్మపేట మండలంలో సంచలనంగా మారింది.
మందలపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు యజమాని.. రోడ్డు పక్కనే ఉన్న ఒక హోటల్ ముందు తన కారును పార్క్ చేశాడు. కాసేపు అలా టిఫిన్ తిని వద్దామని హోటల్ లోపలికి వెళ్లాడో లేదో... అంతలోనే సీన్ రివర్స్ అయింది. కారు యజమాని కళ్లెదుటే గుర్తుతెలియని కొందరు దుండగులు క్షణాల వ్యవధిలో ఆ కారును స్టార్ట్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. కారు దొంగిలించడాన్ని గమనించిన యజమాని... అప్రమత్తమై కేకలు వేసేలోపే దొంగలు కారుతో హైవేపై చెక్కేశారు.
►ALSO READ | ఇవి ఆక్రమణలు కాదా?..పెద్దోళ్లను వదిలేసి పేదలపైనే కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతాపం..
ఈ షాకింగ్ ఘటనపై కారు యజమాని వెంటనే దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. హైవేపై ఉన్న సిసిటివి కెమెరాల ఫుటేజీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. దొంగలు కారును ఏ రూట్‌లో తీసుకెళ్లారనే కోణంలో విచారణ జరుపుతూ... నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హైవేపై ప్రయాణించే వాహనదారులు తమ వాహనాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
