- కరీంనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణల పేరిట చిరువ్యాపారులపై బల్దియా కొరడా
- పండ్లు, కూరగాయల దుకాణాల తొలగింపు.. బడా వ్యాపారుల ఆక్రమణలపై సైలెంట్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో రోడ్లు, ఫుట్ పాత్ ల ఆక్రమణలపై బల్దియా, ట్రాఫిక్ పోలీసులు గత మూడు రోజులు తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదంగా మారాయి. ఫుట్ పాత్లు ఆక్రమించారని, రోడ్ల వెంట వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పండ్లు, కూరగాయల దుకాణాలు, చిరు వ్యాపారులను బలవంతంగా తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. బడా వ్యాపారుల ఆక్రమణలను పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
పెద్దోళ్ల విషయంలో ఒకలా.. పేదోళ్ల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారనే అపవాదును అధికారులు ఎదుర్కొంటున్నారు. టవర్ సర్కిల్, జడ్పీ కాంప్లెక్స్ రోడ్డు, మదీనా కాంప్లెక్స్ రోడ్డు, గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్డులో షాపు ఓనర్లు కొన్ని చోట్ల ఫుట్ పాత్ లు ఆక్రమించి మెట్లు కట్టినా, తమ కార్లు, కస్టమర్ల వెహికల్స్ను నిలిపినా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారి విషయంలో 'మామూలు'గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆక్రమణలపైనా దృష్టిసారించాలనే డిమాండ్ చేస్తున్నారు.
