- కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ భూముల్లో ఇతర శాఖల కార్యాలయాలు
- సరిపోను తరగతి గదులు లేక విద్యార్థుల అవస్థలు
- 18 ఎకరాల స్థలాన్ని వినియోగించలేని దుస్థితి
- పోలీస్, ఎన్నికల అధికారుల ఆధీనంలో రెండు కీలక భవనాలు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో ఉన్న కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భారీ స్థలాలు ఉన్నప్పటికీ వినయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ కాలేజీకి చెందిన 18 ఎకరాల భూమిని ఇతర శాఖలు వినియోగించుకోవడంతో.. కాలేజీ విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
కాలేజీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. క్లాస్ రూమ్‌ల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా కాలేజీలోనే షూటింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ల్యాబ్‌లు, తరగతి గదుల కోసం సుమారు 20 గదులు అవసరం కాగా.. ప్రస్తుతం ఏడు గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో సైన్స్ విద్యార్థులకు ల్యాబ్‌లలోనే క్లాసులు నిర్వహించాల్సి వస్తోంది. బాలురకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో బహిరంగ ప్రదేశాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. బాలికలకు కూడా అరకొర టాయిలెట్లతో ఇబ్బందులు తప్పడం లేదు. 1964లో ఏర్పాటైన ఈ కాలేజీకి 1985లో ప్రభుత్వం 40 ఎకరాల భూమిని కేటాయించింది.
అటానమస్ హోదా ప్రక్రియలో భాగంగా నిర్వహించిన సర్వేలో 18 ఎకరాల భూమి కాలేజీకి దూరమైనట్లు గుర్తించారు. ఈ భూమి విలువ రూ.10 కోట్లకుపైగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఇందులో ఐదు ఎకరాలను కాలేజీ అనుమతి లేకుండానే సోషల్ వెల్ఫేర్ భవనానికి కేటాయించారు. ఐదేళ్లు గడుస్తున్నా అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు.
మరో రెండు ఎకరాలను పల్లె ప్రగతికి కేటాయించారు. మరోవైపు బాలికల కోసం నిర్మించిన హాస్టల్ భవనం పోలీసుల ఆధీనంలో ఉండగా.. రూసా నిధులతో నిర్మించిన అధునాతన భవనాన్ని ఎన్నికల అధికారులు పోలింగ్ సామగ్రి నిల్వకు ఉపయోగిస్తున్నారు. ఒకవైపు కాలేజీ స్థలాలను, భవనాలను ఇతర శాఖలు ఉపయోగించుకుంటుండగా.. మరోవైపు కాలేజీలో మాత్రం సరిపడా తరగతి గదులు లేక దాదాపు 600 మంది విద్యార్థులు శిథిలావస్థకు చేరిన గదుల మధ్య విద్యాబోధన చేయాల్సి వస్తోంది.
కాలేజీ ఆస్తులు అప్పగించాలని విజ్ఞప్తి..
పోలింగ్ బాక్సులను తరలించి రూసా భవనాన్ని తమకు అప్పగించాలని పలుమార్లు కలెక్టర్‌ను కోరామని అధ్యాపకులు తెలిపారు. బాలికల హాస్టల్ కోసం నిర్మించిన భవనాన్ని తిరిగి కాలేజీకి అప్పగించాలని ఎస్పీని కూడా కోరినట్లు చెప్పారు. ఇతర శాఖల ఆధీనంలో ఉన్న భవనాలను తిరిగి కాలేజీకి అప్పగిస్తే తమకు చాలా సౌకర్యంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు.
కాలేజీ అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్పందించి కాలేజీ భూములను తిరిగి అప్పగించేలా చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
కాలేజీ భవనాల్లో ఇతర ఆఫీసులు..
కాలేజీ ఆవరణలో బాలికల హాస్టల్ కోసం నిర్మించిన భవనంలో దాదాపు పదేళ్లపాటు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ కొనసాగింది. గతేడాది కొత్త భవనంలోకి పోలీస్ స్టేషన్‌ను తరలించినా.. పాత భవనాన్ని కాలేజీకి అప్పగించకుండా సీసీఎస్‌కు కేటాయించారు. దీంతో సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని హాస్టల్ నుంచి బాలికలు కాలేజీకి రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
రూసా నిధులతో నిర్మించిన అధునాతన తరగతి గదుల భవనాన్ని పోలింగ్ బాక్సుల భద్రత కోసం ఎన్నికల అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పోలీస్ బందోబస్తు ఉండటంతో విద్యార్థులు ఆ భవనం వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పోలింగ్ బాక్సులను ఇతర ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్, ఎన్నికల కమిషన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి.
