- మిశ్రమ ఎరువులు, అటవీ భూములు కనిపించక రైతుల అవస్థలు
- పది జిల్లాల్లో అమలు.., త్వరలో రాష్ట్రమంతా..
- యాప్‌ను సులభతరం చేయాలని రైతుల డిమాండ్
ఖమ్మం/ కొణిజర్ల, వెలుగు: ఎరువుల బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) యాప్ రైతులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఖమ్మం జిల్లాలో ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానంలో ఓటీపీ ఆలస్యం, సర్వర్ సమస్యలు, బుకింగ్ మధ్యలో నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో సులభంగా సాగిన ఎరువుల బుకింగ్ ప్రక్రియ కొత్త యాప్‌లో క్లిష్టంగా మారిందని రైతులు చెబుతున్నారు.
మిశ్రమ ఎరువులు కనిపించక గందరగోళం..
యూరియా, డీఏపీ, పొటాష్‌తో పాటు రైతులు వినియోగించే మిశ్రమ ఎరువుల బుకింగ్‌లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. 28-28-0, 24-24-0, 14-35-14, 10-26-26, అమోనియా, ఎస్‌ఎస్‌పీ వంటి మిశ్రమ ఎరువులు యాప్‌లో స్పష్టంగా కనిపించకపోవడంతో రైతులు తమకు అవసరమైన ఎరువును ఎలా ఎంపిక చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త విధానంపై డీలర్లకూ పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది..
అటవీ భూముల రైతులకు మరో సమస్య..
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలు గతంలో బుకింగ్ యాప్‌లో కనిపించేవి. ప్రస్తుతం ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో ఆ వివరాలు లేకపోవడంతో ఆయా రైతులు ఎరువుల బుకింగ్‌పై అయోమయానికి గురవుతున్నారు.
పక్క జిల్లాలకు పరుగులు..
కొణిజర్ల మండలానికి చెందిన పలువురు రైతులు ఎరువుల కోసం కోదాడ, మహబూబాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి డీఏపీ, కాంప్లెక్స్, ఇతర మిశ్రమ ఎరువులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అన్ని జిల్లాల్లో యాప్‌ను తప్పనిసరి చేస్తే ఈ ప్రత్యామ్నాయం కూడా లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం పది జిల్లాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని త్వరలో మిగతా జిల్లాల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సాంకేతిక సమస్యలు, ఎరువుల రకాల వివరాలు, అటవీ భూముల సమస్యలను పరిష్కరించకుండానే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే రైతుల ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.
రైతుకు అర్థమయ్యేలా యాప్ ఉండాలి..
ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం డిజిటల్ విధానాన్ని రైతులు స్వాగతిస్తున్నా సాంకేతికత ఎరువు పొందేందుకు అడ్డంకిగా మారకూడదని కోరుతున్నారు. ఓటీపీ, సర్వర్ సమస్యలను పరిష్కరించి, అన్ని రకాల ఎరువులు, అటవీ భూముల వివరాలు యాప్‌లో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు, డీలర్లకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన చోట ప్రత్యామ్నాయ బుకింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
సమస్యలని పరిష్కరిస్తున్నాం..
కేంద్రం తీసుకువచ్చిన ఫెర్టిలైజర్ యాప్ లో చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. హక్కు పత్రాలున్న పోడు రైతుల వివరాలు కూడా యాప్ లో ఉన్నాయి. పోర్టల్ లో నమోదైన అన్ని రకాల రైతులున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరులు ఎవరైనా ఉంటే ఎన్ డీఎస్ ఆప్షన్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జిల్లా యూనిట్ గా ఎరువులు చూపించడం వల్ల కొంత సమస్య ఎదురవుతోంది. వారం రోజుల్లో మండలం యూనిట్ గా తీసుకుని అప్ డేట్ చేస్తాం. - ధనసరి పుల్లయ్య, ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
