రూ. 13 వేల కోట్లతో..6 వేల కిలోమీటర్ల HAM రోడ్ల పైలాన్ ఆవిష్కరణ

రూ. 13 వేల కోట్లతో..6 వేల కిలోమీటర్ల HAM రోడ్ల పైలాన్ ఆవిష్కరణ

తెలంగాణ వ్యాప్తంగా రహదారుల రూపురేఖలను మార్చేలా అత్యంత ప్రతిష్టాత్మకమైన 'హైబ్రీడ్ యాన్యుటీ మోడ్' (HAM) రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించి, ఈ మెగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో... మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 13,060 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ రహదారుల విస్తరణ పనులు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీల కింద, మొత్తం 6,092 కిలోమీటర్ల పొడవు గల 441 కీలక రహదారులను ఈ ప్రాజెక్టు ద్వారా అద్భుతంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పైలాన్ ఆవిష్కరణతో తెలంగాణ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కనుంది.

ఇక పైలాన్ ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకెళ్లారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో షేక్ హ్యాండ్ చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు.