సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారుల పైనే ఉందని రాష్ట్ర అగ్రికల్చర్ కోఆపరేటివ్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేక అధికారి కె. సురేంద్రమోహన్ సూచించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని, సమాజంలో విద్య, వైద్యం సక్రమంగా అందితే పేదరికం ఉండదని పేర్కొన్నారు. అధికారులు రొటీన్ పనులకు భిన్నంగా వినూత్నంగా ఆలోచించి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. 99 రోజుల పాటు సాగిన ఈ ప్రణాళికలో జిల్లా యంత్రాంగం పకడ్బందీగా పనిచేసిందని అభినందిచారు. ఈ సమీక్షకు ముందు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన చూశారు.
