- పుణె వ్యాపారవేత్త హత్యలో వెలుగులోకి సంచలన విషయాలు
పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె వ్యాపారవేత్త హత్యలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరానికి చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌ను కాబోయే భార్య సియా గోయల్ హత్య చేసిన విషయం తెలిసిందే. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం కేతన్‌ను లోహ్ గఢ్ కోటకు తీసుకెళ్లిన సియా.. కోట పైనుంచి కిందికి తోసింది. దీంతో తీవ్రగాయాలతో కేతన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు సియా చెప్పిన స్టోరీ మొత్తం బయటపడింది. దీంతో సియాతో పాటు కేతన్ హత్యకు కుట్ర చేసిన ఆమె ప్రియుడు చేతన్ చౌధరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉందంతంలో కేతన్ ఫ్యామిలీతో పాటు, సియా కుటుంబం, ఇరువర్గాల బంధువులు సహా అందరిలో సహజంగా ఎదురైన ప్రశ్న ‘కేతన్‌తో పెళ్లి ఇష్టంలేదని ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకుని ఉండొచ్చు కదా’ అనే. విచారణలో భాగంగా పోలీసులు ఇదే ప్రశ్న అడగగా సియా షాకింగ్ జవాబిచ్చింది. ‘కేతన్‌తో పెళ్లి తనకు ఇష్టంలేదని ఇంట్లో చెప్పడం, నవంబర్‌లో తలపెట్టిన పెళ్లిని రద్దు చేసుకోవడం కన్నా అతడిని చంపెయ్యడమే ఈజీ అనుకున్నా’ అని చెప్పింది. ఈ సమాధానం విన్న పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. ఇంట్లో వాళ్ల సెంటిమెంట్ ను కాదని వారిని బాధ పెట్టడం తనకు ఇష్టంలేదని వివరించింది. కేతన్‌ను హత్య చేసిన తర్వాత రెండు, మూడేళ్ల పాటు పెళ్లిని వాయిదా వేయొచ్చని భావించినట్లు సియా తెలిపింది. చేతన్ చౌధరితో తన ప్రేమ నిజమేనని అంగీకరించిన సియా.. అతడిని పెళ్లి చేసుకోవడం కోసమే కేతన్‌ను అడ్డుతప్పించుకోవాలని భావించానని వివరించింది. కాగా, సియా, చేతన్ల ప్రేమ వ్యవహారం గురించి సియా ఇంట్లో ఏమాత్రం తెలియదని ఆమె సోదరుడు సాహిల్ గోయల్ చెప్పారు. ఆ ప్రేమ వ్యవహారం గురించి సియా ఇంట్లో చెప్పి ఉంటే తాము కేతన్‌తో ఎంగేజ్ మెంట్ జరిపించేవారమే కాదన్నారు. చేతన్ ఫ్యామిలీ కూడా తమ వర్గానికి చెందినదే కావడంతో సియా, చేతన్‌లకు పెళ్లి చేసేవారమని సాహిల్ స్పష్టం చేశారు. మరోవైపు, సియా తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురు ఆ హత్య చేసి
ఉండదని, ఒకవేళ నిజంగానే కేతన్ హత్యకు కారణం సియా అని తేలితే ఆమెను ఉరితీయాలని చెప్పారు.
