బఫర్ జోన్ లోనే  కేటీఆర్, హరీశ్ ఫామ్ హౌస్ లు..  ఫోటోలు రిలీజ్ చేసిన రైతు కమిషన్ 

బఫర్ జోన్ లోనే  కేటీఆర్, హరీశ్ ఫామ్ హౌస్ లు..  ఫోటోలు రిలీజ్ చేసిన రైతు కమిషన్ 

తెలంగాణలో రాజకీయ రగడ మళ్లీ రాజుకుంది. తాజాగా తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావులపై సంచలన ఆరోపణలు చేస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పెద్దఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడిందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా జన్వాడ, అజీజ్‌నగర్‌లలోని ఫాంహౌస్‌లకు సంబంధించిన ఫోటోలను ఆయన విడుదల చేశారు. జన్వాడలోని ఫాంహౌస్ బఫర్ జోన్ మరియు ఎఫ్‌టీఎల్‌ (FTL) పరిధిలో ఉందని, గండిపేట చెరువులోకి వెళ్లే కాలువను కేటీఆర్ కబ్జా చేసి చట్టాలను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. జన్వాడ ఫాంహౌస్ ప్రదీప్ రెడ్డి పేరున ఉందని చెబుతున్నప్పటికీ, అసలు ప్రదీప్ రెడ్డి ఎవరో, కేటీఆర్‌తో ఆయనకు ఉన్న సంబంధాలు ఏమిటో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావు కూడా బఫర్ జోన్‌లోనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, మంత్రులుగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. గత BRS హయాంలో ఉద్యమకారులను విస్మరించి, లక్షల ఎకరాల అసైన్డ్, భూదాన్ భూములను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని కోదండ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు.