చెన్నై: తమిళనాడులో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వైకో నేతృత్వంలోని ఎండీఎంకే పార్టీ.. డీఎంకే కూటమి నుంచి వైదొలిగింది. డీఎంకేతో ఉన్న తొమ్మిదేండ్ల బంధాన్ని తెంచుకుంది. శనివారం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎండీఎంకే పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరిగాయని.. రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక రహస్య వ్యూహం నడుస్తోందని వైకో పార్టీ ఆరోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకేతో కలిసి కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే, ఎండీఎంకే ఆరోపణలను డీఎంకే తిప్పికొట్టింది.
ఎండీఎంకేకు అసెంబ్లీ, పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం దక్కేలా చేసింది డీఎంకేనే అని గుర్తుచేసింది. వైకో తన జీవితకాలమంతా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఇప్పుడు తన కుమారుడు దురై వైకోను పార్టీలో ఉన్నత పదవికి తీసుకురావడం వల్లే ఆ పార్టీ బలహీనపడిందని డీఎంకే నేత సయ్యద్ హఫీజుల్లా విమర్శించారు. కాగా, ఎండీఎంకే.. విజయ్ ప్రభుత్వానికి స్వాగతం పలికింది.
అవినీతి రహిత పాలన, మేకేదాటు ఆనకట్ట వంటి విషయాల్లో తమిళనాడు హక్కుల రక్షణపై ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని కోరింది. అయితే, టీవీకే కూటమిలో చేరుతున్నట్టు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. ఎండీఎంకేకు కూడా ఒక గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. తాము డీఎంకేతోనే ఉంటామని స్పష్టం చేశారు.
దీనివల్ల అసెంబ్లీలో ప్రస్తుతానికి ఎలాంటి ఉపఎన్నికల పరిస్థితి రాదు. కాగా, ఒకప్పుడు డీఎంకే నేత కరుణానిధికి వైకో అత్యంత నమ్మకస్థుడిగా ఉండేవారు. అయితే, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణ కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌కు రాజకీయంగా అడ్డుగా మారుతుందనే కారణంతో 1993లో ఆయనను డీఎంకే నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత వైకో ఎండీఎంకేను స్థాపించారు. డీఎంకేతో ఆయనకున్న ‘ప్రేమ-ద్వేషం’ బంధం కారణంగా గతంలోనూ పలుమార్లు కూటమి లోపలికి, బయటకి వస్తూ ఉన్న వైకో.. ఇప్పుడు మరోసారి స్టాలిన్ కూటమికి గుడ్-బై చెప్పారు.
