రాత్రి 9 గంటలకు సడెన్ మీటింగ్‌.. పైసా పరిహారం ఇవ్వకుండా150 మంది టెక్కీల లేఆఫ్

రాత్రి 9 గంటలకు సడెన్ మీటింగ్‌.. పైసా పరిహారం ఇవ్వకుండా150 మంది టెక్కీల లేఆఫ్

కార్పొరేట్ ప్రపంచంలో ఐటీ ఉద్యోగం అంటే ఒకప్పుడు లైఫ్ సెటిల్డ్ అనుకునేవారు. ప్రస్తుత రోజుల్లో ఎప్పుడు ఏ ఉద్యోగం ఊడుతుందో.. ఏ నిమిషంలో పింక్ స్లిప్ చేతికి వస్తుందో తెలియని ఒక భయంకరమైన పరిస్థితి నెలకొంది. తాజాగా 'హై-వీ'(Hy-Vee) అనే సంస్థలో జరిగిన ఒక షాకింగ్ లేఆఫ్స్ ఐటీ కమ్యూనిటీని నివ్వెరపరుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. కేవలం ఒకే ఒక్క రాత్రిలో ఏకంగా 150 మంది ఇంజనీరింగ్ టీమ్ ను తొలగించింది సదరు యాజమాన్యం. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'రెడిట్' వేదికగా జరిగింది మెుత్తం బయటపెట్టాడు. 

ఒకరోజు రాత్రి 9 గంటలకు హఠాత్తుగా ఇంజనీరింగ్ టీమ్‌లోని దాదాపు 150 మంది సభ్యులకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ కాల్‌ కోసం ఇన్విటేషన్ వచ్చింది. ఆఫీస్ అవర్స్ అయిపోయాక ఇంత సడెన్ మీటింగ్ ఏంటా అని ఉద్యోగులంతా కంగారుగా జాయిన్ అయ్యారు. తీరా మీటింగ్ మొదలయ్యాక కంపెనీ బాంబు పేల్చింది. కంపెనీలో పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని.. అందులో భాగంగా వారి ఇంజనీరింగ్ టీమ్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పేసింది. ఆ ఒక్క మీటింగ్‌తో అంతా ముగిసిపోయింది. ఆకాశం విరిగి నెత్తిన పడ్డట్లు అనిపించిందని, అసలు ఏం జరుగుతుందో ఊహించేలోపే చాట్ కట్ అయిపోయిందని ఆ ఉద్యోగి వాపోయాడు.

ఈ లేఆఫ్‌లో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. ఉద్యోగాలు తీసేసినందుకు కంపెనీ ఎలాంటి 'సెవెరెన్స్ ప్యాకేజీ' లేఆఫ్ ప్యాకేజీ ఇవ్వకపోవటమే. సాధారణంగా కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించినప్పుడు కొన్ని నెలల జీతాన్ని పరిహారంగా ఇస్తాయి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. బాధితుడు మొదట ఈ కంపెనీలో ఇంటర్న్‌గా చేరి 7 నెలలు పనిచేశాడు. అతని ప్రతిభను చూసి ఫుల్-టైమ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ప్రమోట్ చేశారు. రియాక్ట్, నోడ్.జెఎస్, జావాస్క్రిప్ట్ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలపై దాదాపు 1.8 ఏళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి ప్రాజెక్టులు బిల్డ్ చేసినా.. కంపెనీ మాత్రం ఒక్క రాత్రిలో నడిరోడ్డుపై నిలబెట్టిందని రెడిట్ పోస్టులో పేర్కొన్నాడు యువ టెక్కీ.

ALSO READ : పర్సనల్ లోన్ ముందే కట్టేస్తున్నారా?

ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఇళ్లు, రూమ్ రెంట్లు కట్టుకోవడానికే ఇబ్బంది పడుతుంటే.. కంపెనీలు ఇలా పరిహారం కూడా ఇవ్వకుండా ఎలా తీసేస్తాయి? అని ఒకరు ప్రశ్నించారు. కంపెనీలు లాభాల్లో ఉన్నా కూడా కేవలం ఖర్చులు తగ్గించుకోవడానికి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నాయని, ఈ ఏఐ రేసులో ఐటీ ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫర్ లెటర్లలోనే కొన్ని కంపెనీలు లేఆఫ్స్ చేస్తే పరిహారం ఇవ్వం అనే క్లాజులు పెడుతున్నాయని.. కాబట్టి ఐటీ ఉద్యోగులు ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని మరికొందరు హెచ్చరిస్తున్నారు.