అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మనకు గుర్తొచ్చే మొదటి ఆప్షన్ పర్సనల్ లోన్. అయితే ఐదేళ్లో లేదా మూడేళ్లో ప్రతి నెలా EMI కట్టడం ఒక పెద్ద భారంగా మారుతుంది. అందుకే అకస్మాత్తుగా ఏదైనా బోనస్ వచ్చినప్పుడో, చేతిలో కొంత డబ్బు మిగిలినప్పుడో.. అబ్బా ఈ లోన్ కాస్త ముందే కట్టేసి ప్రశాంతంగా ఉందాం అని చాలా మంది అనుకుంటారు. కానీ లోన్ ముందే కట్టేయడం ఎల్లప్పుడూ లాభదాయకం కాదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు ఇది మీ డబ్బును ఆదా చేయడానికి బదులు.. జేబుకు మరింత చిల్లు పెట్టే అవకాశం ఉంది. అందుకే ముందస్తు చెల్లింపు చేసే ముందు ఈ కీలక విషయాలు తెలుసుకోవాలి.
లోన్ ఎప్పుడు క్లియర్ చేస్తున్నారనేది మీ పొదుపును నిర్ణయిస్తుంది. సాధారణంగా ఐదేళ్ల లోన్‌లో, మొదటి రెండు మూడేళ్ల ఈఎంఐలలో ఎక్కువ భాగం వడ్డీకే పోతుంది. ఈ ప్రారంభ దశలోనే మీరు లోన్ క్లియర్ చేస్తే.. అసలు తగ్గి భారీగా వడ్డీ ఆదా అవుతుంది. అలా కాకుండా నాలుగో ఏట లేదా ఐదో ఏట లోన్ క్లియర్ చేస్తే బ్యాంక్ ఇప్పటికే తన లాభాన్ని వసూలు చేసేసి ఉంటుంది. ఆ టైమ్‌లో ముందే కట్టడం వల్ల మీకు ఎలాంటి ఆర్థిక లాభం ఉండదు. పైగా లోన్ ముందే క్లోజ్ చేయడం వల్ల బ్యాంకులకు వచ్చే ఆదాయం తగ్గుతుంది కాబట్టి.. వారు 2% నుండి 5% వరకు ఫోర్‌క్లోజర్ పెనాల్టీతో పాటు 18% జీఎస్టీ విధిస్తారు. సో దీనివల్ల ఆదా అయ్యే వడ్డీ కంటే పెనాల్టీ ఎక్కువై మీరే నష్టపోయే ఛాన్స్ ఉందని గుర్తుంచుకోండి.
మరో క్రేజీ పాయింట్ ఏంటంటే.. మీ దగ్గర ఉన్న అదనపు డబ్బును లోన్ కట్టడానికి వాడాలా? లేక పెట్టుబడి పెట్టాలా? అని ఆలోచించాలి. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా 12% నుండి 16% వరకు ఉంటాయి. ఒకవేళ మీరు 15% వడ్డీ ఉన్న లోన్‌ను క్లియర్ చేస్తే.. భవిష్యత్తులో అయ్యే ఖర్చును ఆపినట్లు అవుతుంది. కానీ మీ పాత లోన్ వడ్డీ 10% ఉండి.. మీ చేతిలో ఉన్న డబ్బును ఇండెక్స్ ఫండ్‌లో పెడితే 13% రిటర్న్స్ వస్తుంటే.. ఆ డబ్బును మార్కెట్లోనే ఉంచడం తెలివైన పని అవుతుంది.
ఒకవేళ మీరు పార్ట్-పేమెంట్ చేయాలనుకుంటే.. బ్యాంకులు రెండు ఆప్షన్లు ఇస్తాయి. ఒకటి నెలకు కట్టే ఈఎంఐ తగ్గించుకోవడం, రెండు లోన్ కాలపరిమితిని తగ్గించడం. ఈఎంఐ తగ్గిస్తే నెలవారీ బడ్జెట్‌కు కాస్త ఊరట దొరుకుతుంది. కానీ ఈఎంఐ అలాగే ఉంచి కాలపరిమితిని తగ్గిస్తేనే అసలు వేగంగా తగ్గి, ఎక్కువ వడ్డీ ఆదా అవుతుంది. అయితే లోన్ భారం తగ్గించుకోవాలనే ఆత్రుతతో బ్యాంకు అకౌంట్ మొత్తం ఖాళీ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర వైద్య ఖర్చులు, ఉద్యోగం కోల్పోవడం వంటి ఆపదలు వస్తే చేతిలో లిక్విడ్ క్యాష్ ఉండాలి. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును పక్కన పెట్టుకున్నాకే లోన్ ముందస్తు చెల్లింపుల గురించి ప్లాన్ చేసుకోవటం బెటర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
