సీషెల్స్ లో మోదీకి ఘన స్వాగతం.. ద్వీప దేశంలో ప్రధాని మూడు రోజుల పర్యటన

సీషెల్స్ లో మోదీకి ఘన స్వాగతం.. ద్వీప దేశంలో ప్రధాని మూడు రోజుల పర్యటన
  • ఎయిర్​పోర్ట్​లో కచ్ నృత్యాలతో వెల్కమ్

విక్టోరియా:  ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం హిందూ మహాసముద్ర ద్వీపదేశమైన సీషెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టారు. సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు వెళ్లిన మోదీకి అక్కడ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 

స్థానిక సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ‘కచ్’ సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలకడం విశేషం. విమానాశ్రయం వెలుపల భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు మోదీకి వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ, ఉన్నతాధికారుల బృందం ప్రధానికి నేరుగా స్వాగతం పలికి, గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) సమర్పించారు. 

దీనిపై ప్రధాని మోదీ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో స్పందిస్తూ.. ‘‘అద్భుతమైన సాంస్కృతిక అనుబంధం! సీషెల్స్ విమానాశ్రయంలో కచ్ నృత్యంతో స్వాగతం లభించింది. మన ప్రవాస భారతీయులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని ఇక్కడ కూడా ఎంతగానో కాపాడుకుంటూ వేడుకగా జరుపుకుంటున్న తీరు నిజంగా అభినందనీయం” అని ప్రశంసించారు. 

బొటానికల్ గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటన

 ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రధాని మోదీ, అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో కలిసి నేరుగా ‘సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్’కు చేరుకున్నారు. అక్కడ ఇద్దరు నేతలు సంయుక్తంగా  సీషెల్స్ జాతీయ చిహ్నంలో భాగమైన, ప్రపంచంలోనే అతిపెద్ద గింజలు, అత్యంత బరువైన పండ్లను కాసే అరుదైన ‘కోకో డి మెర్’ మొక్కను  నాటారు. పచ్చని పుడమి కోసం ఇరు దేశాల సంకల్పానికి ఇది ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జీవిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన సుమారు 194 ఏండ్ల వయసు గల ‘జొనాథన్’ అనే ఆల్డబ్రా జెయింట్ తాబేలును మోదీ సందర్శించారు. దానికి  ఆహారాన్ని తినిపించారు.

జాతీయ దినోత్సవాల్లో ‘చీఫ్ గెస్ట్’ గా

భారత్-– సీషెల్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా జరగనున్న స్వర్ణోత్సవాలు, అలాగే సీషెల్స్ జాతీయ దినోత్సవాల్లో ప్రధాని మోదీ ‘చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల ప్రత్యేక బృందం, నౌకాదళ నౌకలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొంటారు.