అస్సాంలో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే నాలుగు జిల్లాల్లో 1.12 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. మరోవైపు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో మరిన్ని ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉంది.
వాతావరణ శాఖ హెచ్చరికలు:
చరాయిదేవ్, దిబ్రూగఢ్, జోర్హాట్, శివసాగర్, టిన్సుకియా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి వాతావరణ కేంద్రం తెలిపింది. గోలాఘాట్ జిల్లాలోని నుమాలిగఢ్ వద్ద ధన్‌సిరి నది, శ్రీభూమి వద్ద కుషియారా నదుల నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో, ప్రజలు నదులకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వరద ఉధృతి ప్రభావం
ఈ వరదల వల్ల అదృష్టవశాత్తూ కొత్తగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ ఏడాది వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 101గా ఉంది.
ఎక్కువగా దెబ్బతిన్న జిల్లాలు చూస్తే గోలాఘాట్ జిల్లాలో 65,000 మందికి పైగా బాధితులు, శివసాగర్ జిల్లాలో దాదాపు 20,000 మంది బాధితులు, నాగావ్ జిల్లాలో 16,000 మందికి పైగా బాధితులు ఉన్నారు.
సహాయక చర్యలు: బాధితుల కోసం 92 రీలీఫ్ క్యాంపులు, సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 30,000 మందికి పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించారు.
ఆహార పంపిణీ: గత 24 గంటల్లో ప్రభుత్వం బాధితులకు బియ్యం, పప్పు, ఉప్పు, ఆవనూనెను పెద్ద ఎత్తున అందజేసింది.
నష్టం వివరాలు:
అస్సాం రాష్ట్రవ్యాప్తంగా 441 గ్రామాలు నీట మునిగాయి. దాదాపు 10,879 హెక్టార్ల పంట పొలాలు పాడయ్యాయి. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు, కట్టలు దెబ్బతిన్నాయి. వీటితో పాటు 31,000కి పైగా పెంపుడు జంతువులు, కోళ్లు కూడా ఈ వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
