కొలంబియా అతలాకుతలం.. 2 వేల మంది మిస్సింగ్, 16 వందల భవనాలు ధ్వంసం

కొలంబియా అతలాకుతలం.. 2 వేల మంది మిస్సింగ్, 16 వందల భవనాలు ధ్వంసం
  • 181కి చేరిన మృతుల సంఖ్య
  •     195 మంది మిస్సింగ్​.. 
  • క్షతగాత్రుల సంఖ్య 2,595
  •     1,600 భవనాలు ధ్వంసం
  •     కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌

బొగోటా: పశ్చిమ కొలంబియాలో సోమవారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఇప్పటి వరకు 181 మంది మరణించారు. మరో 2,595 మంది గాయపడ్డారని, 195 మంది ఆచూకీ దొరకడంలేదని అధికారవర్గాలు తెలిపాయి. అనధికారిక సమాచారం ప్రకారం గల్లంతైన వారి సంఖ్య 3,800 వరకు ఉంటుందని సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో దేశాన్ని పెను భూకంపం కుదిపేసింది.

రిక్టర్ స్కేలుపై 7.4 పాయింట్ల తీవ్రత నమోదైంది. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత శక్తిమంతమైన భూకంపమని అధికారులు తెలిపారు. వందలాది భవనాలు కూలిపోయాయని, వాటి శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

దెబ్బతిన్న ఇండ్లు, భవనాలు, స్కూళ్లు..

కొలంబియా ప్రెసిడెంట్ అబెర్డో డి లా ఎస్ప్రియెల్లా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ విపత్తు సంభవించడం నూతన ప్రభుత్వాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా 1,575 ఇండ్లు, 18 ఆరోగ్య కేంద్రాలు, 52 స్కూళ్లు  దెబ్బతిన్నాయని, 61 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఎస్ప్రియెల్లా వెల్లడించారు.

సహాయక చర్యలకు అంతరాయం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. పెరీరాలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలగా, మానిజేల్స్‌‌‌‌‌‌‌‌లో చారిత్రక కేథడ్రల్ గోపురం నేలమట్టమైంది. కాలి నగరంలో ఐదు అంతస్తుల భవనం శిథిలాల కింద నుంచి ఆరు నెలల చిన్నారిని, ఆమె తల్లిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో రక్షించారు. 

మరోవైపు, భూకంప కేంద్రం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉండటం, చోకో వంటి మారుమూల ప్రాంతాలు దట్టమైన అడవులతో కూడి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తున్నారు.