డమాస్కస్: సిరియాలో ఐదు దశాబ్దాలపాటు సాగిన అసద్ కుటుంబ అరాచక పాలనకు అంతం పలికిన 20 నెలల తర్వాత ఆ దేశ న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. 14 ఏండ్లపాటు సాగిన అంతర్యుద్ధంలో మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నేరాలకు, యుద్ధ నేరాలకు పాల్పడినందుకు మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్‌తోపాటు అతడి సోదరుడు మాహేర్ అసద్‌కు డమాస్కస్‌లోని నాల్గో క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది.
ప్రస్తుతం వీరిద్దరూ రష్యాలో తలదాచుకోవడంతో వీరి గైర్హాజరీలోనే కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులోనే సిరియా అంతర్యుద్ధానికి మూలకారకుడైన అసద్ మేనత్త కొడుకు, మాజీ సైనిక అధికారి ఆతెఫ్ నజీబ్‌కు కూడా కోర్టు మరణదండన విధించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఖైదీ దుస్తుల్లో బోనులో నిలబడిన నజీబ్ సమక్షంలోనే న్యాయమూర్తి ఫఖ్రెద్దీన్ అల్- ఆరియాన్ తీర్పును చదివి వినిపించారు. నజీబ్ ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
అంతర్యుద్ధానికి దారితీసిన అరాచకం..
2011లో దరా ప్రావిన్స్ పొలిటికల్ సెక్యూరిటీ బ్రాంచ్ హెడ్‌గా పనిచేసిన నజీబ్.. గోడలపై ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాశారనే సాకుతో డజనుకు పైగా టీనేజర్లను దారుణంగా హింసించాడు. ఈ ఉదంతం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చి, దేశవ్యాప్త నిరసనలకు కారణమైంది. అసద్ బలగాలు చేపట్టిన క్రూరమైన అణచివేత చివరికి 14 ఏండ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. ఈ ఘర్షణల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది శరణార్థులుగా మారారు.
2024 డిసెంబర్‌లో తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో.. అసద్‌తోపాటు ఆయన సోదరుడు మాహెర్ రష్యాకు పారిపోయారు. నజీబ్‌ను స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సైన్యంలో బ్రిగేడియర్ జనరల్‌గా పనిచేసిన నజీబ్.. దారా ప్రావిన్స్‌లో రాజకీయ భద్రతా విభాగానికి అధిపతిగా ఉన్నారు. మాహెర్ సైతం సైన్యంలో పనిచేశారు.
కాగా, కోర్టు తీర్పు వెలువడగానే ప్రాణాలు కోల్పోయిన, హింసకు గురైన బాధితుల కుటుంబాలు, ప్రాణాలతో బయటపడిన నాటి టీనేజర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇది బాధితులకు దక్కిన విజయమని కొనియాడారు. మరొకవైపు, ఈ తీర్పుపై ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ప్రతినిధి హిబా జయాదిన్ స్పందిస్తూ.. ఏ కేసులోనైనా మరణశిక్ష విధించడాన్ని తాము వ్యతిరేకిస్తామని, బాధితులకు నిజమైన న్యాయం జరగాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా పారదర్శకమైన విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు.
