భారతీయ కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల కోసం కేవలం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడటం లేదు. ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ టాలెంట్‌ను వెతుక్కుంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. గ్లోబల్ పేరోల్, హెచ్‌ఆర్ ప్లాట్‌ఫామ్ డీల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. 77 శాతం భారత కంపెనీలు రాబోయే 12-18 నెలల్లో విదేశీ రిక్రూట్మెంట్స్ పెంచాలని ప్లాన్ చేస్తున్నాయని తేలింది. 7 ప్రధాన నగరాలకు చెందిన 1,008 మంది సీనియర్ బిజినెస్, హెచ్‌ఆర్ నిర్ణయాధికారుల అభిప్రాయాలతో ఈ సర్వే రూపొందింది. అంటే భారత కంపెనీల గ్లోబల్ విస్తరణలో విదేశీ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారు.
టాలెంట్ కోసం ప్రపంచం వైపు చూపు
విదేశాల్లో నియామకాలకు ప్రధాన కారణం కేవలం ఉద్యోగుల కొరత కాదు. ప్రత్యేక నైపుణ్యాలు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న స్కిల్స్ వారిలో అందుబాటులో ఉండటం కారణమని 34 శాతం కంపెనీలు చెప్పాయి. మరో 33 శాతం కంపెనీలు తమ కస్టమర్లు, స్థానిక మార్కెట్లకు దగ్గరగా ఉండేందుకు విదేశాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాయట. ఇక 20 శాతం సంస్థలు 24 గంటలూ కార్యకలాపాలు కొనసాగించేందుకు గ్లోబల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాయి.
AI, టెక్ నిపుణులకు భారీ డిమాండ్
విదేశాల్లో భారత కంపెనీలు ఎక్కువగా వెతుకుతున్న ఉద్యోగుల్లో టెక్నాలజీ, ఇంజినీరింగ్ నిపుణులు ముందున్నారు. మన దగ్గరే కుప్పలు కుప్పలుగా ఇంజనీర్లు, టెక్ నిపుణులు ఉంటే మళ్లీ విదేశాలకు మన కంపెనీలు ఎందుకు వెళుతున్నాయో అర్థం కావట్లేదు చాలా మందికి. గ్లోబల్‌గా నియామకాలు చేపడుతున్న కంపెనీల్లో 89 శాతం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ టాలెంట్‌ను కోరుతున్నాయట. ముఖ్యంగా కోర్ డెవలపర్లు, AI/ML నిపుణులు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఉద్యోగులకు డిమాండ్ ఉంది. 80 శాతం కంపెనీలు సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ నిపుణులను, 45 శాతం సంస్థలు ప్రొడక్ట్, డిజైన్ టాలెంట్‌ను వెతుకుతున్నాయి.
కస్టమర్లు ఉన్న చోటే ఉద్యోగులు
విదేశీ నియామకాల్లో మరో ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రపంచ కంపెనీలు ఖర్చు తక్కువగా ఉండటంతో భారత్‌లో ఉద్యోగులను నియమించుకునేవి. ఇప్పుడు భారత కంపెనీలే ప్రపంచంలోని టాలెంట్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే దేశాల్లోనే టీమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక కస్టమర్లను, మార్కెట్ అవసరాలను మరింత దగ్గరగా అర్థం చేసుకోవాలని చూస్తున్నాయి. విదేశీ నియామకాలకు నార్త్ అమెరికా 36 శాతంతో మొదటి గమ్యస్థానంగా ఉండగా.. యూరప్/యూకే 27 శాతం, ఏపీఏసీ 21 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అసలు సమస్య టాలెంట్ కాదు.. కంప్లయెన్స్
అయితే విదేశాల్లో ఉద్యోగులను నియమించుకోవడం అంత సులభం కాదు. 76 శాతం కంపెనీలు గ్లోబల్ విస్తరణలో ప్రధాన సమస్యగా కంప్లయెన్స్, అడ్మినిస్ట్రేటివ్ భారం ఉందని చెబుతున్నాయి. ప్రతి దేశంలో వేర్వేరు పేరోల్, పన్నులు, ఉద్యోగ చట్టాలు, చట్టబద్ధ ప్రయోజనాలు, డేటా ప్రైవసీ నిబంధనలు ఉంటాయి. స్థానిక సంస్థ ఏర్పాటు ఆలస్యం, వీసా సమస్యలు, పేరోల్, పన్ను తప్పిదాలు కూడా కంపెనీల విస్తరణను నెమ్మదిస్తున్నాయి. ఈ ఆలస్యాల కారణంగా 70 శాతం కంపెనీల వివిధ మార్కెట్లలో ప్రొడక్ట్ లాంచ్‌లు వాయిదా వేసుకోవాల్సి వస్తోందట.
విదేశీ ఉద్యోగులు ఎందుకు కీలకం?
భారత కంపెనీలు ఇక విదేశీ నియామకాలను అప్పటికప్పుడు అవసరమైన ఉద్యోగుల భర్తీగా కాకుండా.. దీర్ఘకాలిక గ్లోబల్ బిజినెస్ వ్యూహంగా చూస్తున్నాయి. ఇప్పటికే 54 శాతం కంపెనీల ఉద్యోగుల్లో నాలుగో వంతుకు పైగా భారత్ వెలుపల పనిచేస్తున్నారు. 58 శాతం సంస్థలు 4 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో భారత కార్పొరేట్ రంగం కేవలం విదేశాల్లో ఉత్పత్తులు, సేవలు అమ్మడమే కాకుండా.. కస్టమర్లు ఉన్న దేశాల్లోనే టీమ్‌లను నిర్మించి, అక్కడి టాలెంట్‌తో ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడే దిశగా అడుగులు వేస్తోంది.
