సంక్షేమ పథకాల కోసం లీటర్‌ పెట్రోల్, డీజిల్ 60 పైసలు బాదుడు : ఆ రాష్ట్రం ఏంటో తెలుసుకోండి..!

సంక్షేమ పథకాల కోసం లీటర్‌ పెట్రోల్, డీజిల్ 60 పైసలు బాదుడు : ఆ రాష్ట్రం ఏంటో తెలుసుకోండి..!

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇప్పటికే వాహనదారులు ఇబ్బందులు పడుతున్న వేళ.. మరో కొత్త టాక్స్ తెరపైకి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై లీటర్‌కు 60 పైసల చొప్పున ‘అనాథలు, వితంతువుల సెస్‌’ను విధించింది. ఆగస్టు 11 అర్ధరాత్రి నుంచి ఈ కొత్త సెస్ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై వినియోగదారులు ఇకపై అదనంగా 60 పైసలు చెల్లించుకోక తప్పదు.

స్టేట్ టాక్స్, ఎక్సైజ్ శాఖ ఆగస్టు 11న జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సెస్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ మొదటిసారి విక్రయించే సమయంలోనే వసూలు చేస్తారు. అంటే సరఫరా వ్యవస్థలో ప్రతి దశలో కాకుండా.. రాష్ట్రంలో జరిగే తొలి విక్రయంపైనే ఈ అదనపు భారం పడుతుంది.

►ALSO READ | లోన్ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే గ్యారంటర్ జీతం నుంచి డబ్బు కట్ చేయొచ్చా..? కోర్టు సంచలన తీర్పు

ఈ కొత్త పన్నుకు హిమాచల్‌ప్రదేశ్ వ్యాట్ చట్టం, 2005లోని సెక్షన్ 6-A చట్టబద్ధమైన ఆధారంగా నిలిచింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు మార్చిలో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ‘వ్యాట్ సవరణ బిల్లు-2026’ను ఆమోదించింది. ఈ సవరణతో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై అనాథలు, వితంతువుల సంక్షేమం కోసం ప్రత్యేక సెస్ విధించే అధికారం ప్రభుత్వానికి లభించింది. అయితే ప్రభుత్వం విధించిన 60 పైసలు గరిష్ఠ పరిమితి కంటే చాలా తక్కువ. చట్టం ప్రకారం లీటర్‌కు గరిష్ఠంగా రూ.5 వరకు సెస్ విధించే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో ఈ సెస్‌ను పెంచే అవకాశం కూడా చట్టపరంగా ప్రభుత్వానికి ఉంది.

ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అనాథలు, వితంతువుల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది ఇప్పటికే ఉన్న పెట్రోల్, డీజిల్ పన్నులకు అదనం. దీంతో ఇంధన ధరలపై మరో చిన్న భారం పడనుంది సంక్షేమ సెస్ కారణంగా.