సావిత్రి బాయి ఫూలే.. మదర్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్ : ప్రొఫెసర్ కంచ ఐలయ్య  

సావిత్రి బాయి ఫూలే.. మదర్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్ :  ప్రొఫెసర్ కంచ ఐలయ్య  
  • గుర్తించాలని.. ప్రొఫెసర్ కంచ ఐలయ్య తీర్మానం
  • దళిత, వెనకబడిన ఆదివాసీలకు ఇంగ్లీష్​ విద్య అందాలని సూచన
  • పాక్​పీట్​లో ఐలయ్య విగ్రహం ఆవిష్కరణ 

రామచంద్రాపురం, వెలుగు: మహిళలు, అణగారిన వర్గాలకు విద్యను అందించేందుకు ఉద్యమం సాగించిన సావిత్రిబాయి ఫూలేను మదర్​ఆఫ్​ఇండియన్​ ఇంగ్లిష్​గా గుర్తించాలని ప్రముఖ రచయిత, ప్రొఫెసర్​ కంచ ఐలయ్య షెఫర్డ్​ పిలుపునిచ్చారు. ఆదివారం 209వ ఇండియన్​ ఇంగ్లిష్​ డే, కంచ ఐలయ్య 74వ జన్మదినం సందర్భంగా తెల్లాపూర్​లోని ఆస్క్​ఎడ్యుకేషనల్​ సొసైటీలోని పాక్​పీట్ (ఫూలే అంబేద్కర్​ సెంటర్​ ఫర్​ ఫిలాసఫి అండ్ ఇంగ్లీష్​ ట్రైనింగ్) సెంటర్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలేను మదర్​ఆఫ్​ఇండియన్​ ఇంగ్లిష్​గా తీర్మానిస్తూ రూపొందించిన చిత్రపటాన్ని ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పాక్​పీట్ విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుతూ ప్రొఫెసర్​కంచ ఐలయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆస్క్​ ఫౌండర్, మట్టి మేధావి కొల్లూరి సత్తయ్య, డైరెక్టర్​ కొల్లూరి భరత్, మాజీ ఐఏఎస్​ ఆకునూరి మురళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఐలయ్య రచించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు.

అనంతరం కంచ ఐలయ్య మాట్లాడుతూ టెక్నాలజీ, సైన్స్, ఏఐలాంటి రంగాల్లో దూసుకుపోతున్న ఈ పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లిష్ లాంగ్వేజ్​కీలక సాధనమని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల​ విద్య అవసరమని ముఖ్యంగా గ్రామీణ, పేద, దళిత, ఆదివాసీ, వెనకబడిన వర్గాలకు ఇంగ్లిష్​ను దరి చేయాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు, బాంగ్యా భూక్యా, తిరుపతి, సృజన యాదవ్​, పాక్​పీట్ ప్రొఫెసర్​మణి, ఆస్క్​ సొసైటీ సభ్యులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.