సాగర్‌‌‌‌ ఆయకట్టుకు గోదావరి నీళ్లు.. పంటలను కాపాడేందుకు చివరి తడికి నీరు..

సాగర్‌‌‌‌ ఆయకట్టుకు గోదావరి నీళ్లు.. పంటలను కాపాడేందుకు చివరి తడికి నీరు..
  • ప్రకటన విడుదల చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : సాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలను కాపాడుకునేందుకు రైతుల విజ్ఞప్తి మేరకు సీతారామ ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పంటలు ఎండిపోకుండా అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రంలో విద్యుత్‌‌‌‌ కొరత ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. 

సాగర్‌‌‌‌ ఆయకట్టుతో పాటు అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నామన్నారు. లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ స్కీములకు కూడా విద్యుత్‌‌‌‌ సరఫరా చేస్తామని, వాటి ద్వారా అందుబాటులో ఉన్న నీటిని పొలాలకు అందించి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

అందుబాటులో ఉన్న గోదావరి జలాలను రైతులు పొదుపుగా వాడుకోవాలని, నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే మరింత విస్తీర్ణంలోని పంటలను కాపాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాగర్‌‌‌‌ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే వేసిన పంటలకు చివరి తడి అందించడమే లక్ష్యంగా నీటి విడుదల చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.