నైపుణ్య తెలంగాణే లక్ష్యంగా.. ప్రజా ప్రభుత్వం అడుగులు...

నైపుణ్య తెలంగాణే లక్ష్యంగా.. ప్రజా ప్రభుత్వం అడుగులు...

చేపలు ఇవ్వడం కాదు,  చేపలు పట్టడం నేర్పించాలి’ బాగా ప్రాచుర్యం పొందిన ఈ సామెత నేటి విద్యావిధానాల దిశను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.  ఒకరికి చేపలు ఇస్తే ఒకరోజు జీవిస్తాడు. అదే చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం బతకగలడు.  ఇదే  భావన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు కేంద్రంగా మారింది.  

నైపుణ్యాభివృద్ధి పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. మార్కెట్, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యను ఉపాధితో అనుసంధానించే చర్యలను  ప్రజా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.  కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా  ప్రభుత్వ పాఠశాలల బలోపేతం నుంచి అంతర్జాతీయస్థాయి నైపుణ్యాల కల్పన వరకు సీఎం రేవంత్​రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర  విద్యారంగాన్ని సరికొత్త పథంవైపు నడిపిస్తున్నాయి.  విద్యను  కేవలం డిగ్రీలు  అందించే  వ్యవస్థగా కాకుండా,  జీవితాన్ని నిర్మించేశక్తిగా మార్చేందుకు  ఆయన  చర్యలు తీసుకుంటున్నారు. 

2024 ఆగస్టు 1న ప్రతిష్టాత్మకంగా యంగ్‌‌ ఇండియా స్కిల్‌‌ యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ మార్కెట్‌‌కు  అవనరమైన  నైపుణ్యాలను అందించడం దీని ప్రధాన లక్ష్యం.  ప్రభుత్వ,  ప్రైవేటు భాగస్వామ్యంలో  నడుస్తున్న ఈ  విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్‌‌ రెడ్డి చాన్సలర్‌‌గా ఉండగా, ప్రముఖ  పారిశ్రామికవేత్తలతో కూడిన  బోర్డ్‌‌  ఆఫ్‌‌  మేనేజ్‌‌మెంట్‌‌ పర్యవేక్షిస్తోంది.  

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌‌ మహింద్రా నేతృత్వంలో హైదరాబాద్‌‌ ట్రిపుల్‌‌ ఐటీలోని తాత్కాలిక క్యాంపస్​లో  హెల్త్‌‌కేర్,  లైఫ్‌‌ సైన్సెన్, ఫార్మా, లాజిస్టిక్స్,  బ్యాంకింగ్–ఫైనాన్షియల్‌‌ వంటి రంగాల్లో స్వల్పకాలిక, సర్టిఫికేషన్‌‌ కోర్సులను అందిస్తున్నారు.  టెక్స్ట్‌‌ బుక్ చదువులకు స్వస్తి చెప్పి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు శిక్షణ ఇవ్వాలనే రేవంత్ రెడ్డి విజన్‌‌కు నిదర్శనంగా.. ఇటీవల ఈ యూనివర్సిటీలో ‘డేటా సెంటర్ మేనేజ్‌‌మెంట్’ కోర్సు పూర్తి చేసుకున్న 14 మంది విద్యార్థుల్లో 11 మందిని ప్రముఖ గ్లోబల్ ఐటీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ రూ.7 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం నిజంగా గర్వకారణం.

యువతకు ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యం

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభమైన తొలి ఏడాదిలోనే సుమారు వెయ్యికి పైగా విద్యార్థులు శిక్షణ పొందడం.. నైపుణ్య విద్యపై  ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం.  భవిష్యత్తులో ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.  రంగారెడ్డి  జిల్లా కందుకూరు మండలంలో సుమారు 57 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత క్యాంపస్‌‌  నిర్మాణం కొనసాగుతోంది.  అటు..విద్యార్థుల్లో నైపుణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని  మైనింగ్‌‌ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌‌  మన్మోహన్‌‌ సింగ్‌‌ ఎర్త్ సైన్సెన్‌‌  విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసింది. 

భూగోళ శాస్త్రం, భూవిజ్ఞాన శాస్త్ర రంగాల్లో సమగ్ర విద్యనందించే దేశంలోని  తొలి ప్రత్యేక విశ్వవిద్యాలయంగా ఇది అవతరించింది.  విద్యార్థుల్లో  నైపుణ్యాలను పెంపొందించడం, ఇంటర్న్ షిప్‌‌ అవకాశాలను విస్తరించడం,  ప్రాంగణ నియామకాలను పెంచడం వంటి లక్ష్యాలతో  విశ్వవిద్యాలయాలను సమాయత్తం చేస్తోంది.  

విద్యాసంస్థలు, పరిశ్రమల అనుసంధానానికి కార్యాచరణ

ఇంజినీరింగ్‌‌ విద్యాప్రమాణాల పెంపులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు, ఉపకులపతులు, మద్రాసు ఐఐటీ నిపుణులతో  గతేడాది వర్క్‌‌ షాపు నిర్వహించి, ఇంజినీరింగ్‌‌ కోర్సుల సిలబస్‌‌లో సమూల మార్పుల శ్రీకారం చుట్టింది. సాంకేతిక విద్యను అభ్యసించే డిప్లొమా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పాలిటెక్నిక్‌‌ విద్యలో భారీ మార్పులకూ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

 మార్కెట్,  పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌‌క్రాప్ట్స్‌‌ మెయింటెనెన్స్‌‌ అండ్‌‌ ఇంజినీరింగ్,  సెమికండక్టర్‌‌  టెక్నాలజీ లాంటి  12 కొత్త కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.  ఐఐటీ–హైదరాబాద్‌‌ నిపుణులు,  భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), టాటా టెక్నాలజీస్‌‌ ప్రతినిధుల  సహకారంతో  విద్యను ఉపాధిని  మేళవించేలా  కోర్సులు, సిలబస్‌‌ రూపకల్పనకు చర్యలు చేపట్టింది.  

ఐటీఐల ఆధునికీకరణ

పదో తరగతి తర్వాత విద్యార్ధులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల ఆధునికీకరణకు  ప్రభుత్వం  ప్రాధాన్యం ఇచ్చింది.  టాటా  టెక్నాలజీస్‌‌  లిమిటెడ్‌‌ సహకారంతో రాష్ట్రంలోని ప్రభుత్వ 65 ఐటీఐలను  అడ్వాన్స్‌‌డ్‌‌  టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)లుగా ఆధునీకరించింది.  నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండాలనే భావనతో గ్రామీణ నియోజకవర్గాల్లో కొత్తగా మరో 45 ఏటీసీల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. 

మరోవైపు, ఉపాధి భాషగా  భావించే  ఆంగ్లంలో  విద్యార్థుల్లో  కమ్యూనికేషన్‌‌  నైపుణ్యాల పెంపుపైనా ఉన్నత విద్యామండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది.  డిగ్రీలోని  నాలుగు  సెమిస్టర్లకు స్కిల్డ్ ఆధారిత కామన్‌‌ ఇంగ్లీష్  సిలబస్‌‌ను రూపొందించింది.  ఈ  విద్యాసంవత్సరం నుంచి అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని  డిగ్రీ  కళాశాలల్లో ఈ సిలబస్‌‌ను అమలు చేయనున్నారు.  నిజజీవిత పరిస్థితుల్లో ఉపయోగించే ఇంగ్లిష్‌‌కు  ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ... విద్యార్థుల్లో  మాట్లాడడం,  రాయడం,  చదవడం నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టారు.  ఇదే క్రమంలో ఇక ఇంటర్మీడియట్‌‌ ఇంగ్లిష్‌‌లో  కూడా కమ్యూనికేషన్‌‌ ల్యాబ్‌‌లను  ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్య

విశ్వవిద్యాలయం నుంచి సెకండరీ స్థాయి విద్యదాకా విద్యారంగంలో జరగుతున్న ఈ సంస్కరణలను పరిశీలిస్తే విద్యార్థుల్లో  నెపుణ్యాభివృద్ధిపై  తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. 
ఈ సంస్కరణల అసలు విజయం విద్యార్థులు ఉపాధి పొందే స్థాయిలో కన్పించాల్సి ఉంది.  పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యను నిరంతరం నవీకరించగలిగితేనే ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి.  

తెలంగాణ విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా  పర్యవేక్షిస్తూ, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యాస్థాయి వరకు ఆయన తీసుకుంటున్న సమగ్ర  చర్యలు తెలంగాణను  దేశంలోనే అగ్రగామిగా  నిలబెట్టేందుకు దోహదపడుతున్నాయి.

- ఇందిరా శోభన్ ,కాంగ్రెస్ సీనియర్ నేత