చెక్కపూసలతో మారిన బతుకులు... వేలాది కుటుంబాలకు ఉపాధినిస్తున్న కుటీర పరిశ్రమ...

చెక్కపూసలతో మారిన బతుకులు... వేలాది కుటుంబాలకు ఉపాధినిస్తున్న కుటీర పరిశ్రమ...

హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన మంగలి గ్రామంలోకి అడుగుపెడితే పెద్ద పెద్ద పరిశ్రమలు కనిపించవు. కానీ దాదాపు ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న యంత్రాల శబ్దం వినిపిస్తుంది. అక్కడ తయారయ్యేవి బంగారం, వెండి కాదు... చిన్న చిన్న చెక్క పూసలు. ఈ పూసలే వేలాది కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తూ, మంగలి గ్రామాన్ని దేశంలోనే ప్రముఖ కుటీర పరిశ్రమ కేంద్రంగా నిలబెట్టాయి.

దాదాపు ఆరు దశాబ్దాల క్రితం కొన్ని కుటుంబాలు చెక్క పూసల తయారీని ప్రారంభించాయి. అప్పట్లో పూర్తిగా చేత్తోనే ఈ పని చేసేవాళ్లు. తర్వాత చిన్న యంత్రాలు అందుబాటులోకి రావడంతో ఉత్పత్తి వేగం పెరిగింది. ప్రస్తుతం గ్రామంలోని చాలా కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడ ఇల్లే చిన్న పరిశ్రమ. కుటుంబమంతా కలిసి పని చేయడం ఈ గ్రామ ప్రత్యేకత.

ఎలా చేస్తారంటే..

చెక్క ముక్కలను ముందుగా చిన్న ముక్కలుగా కోస్తారు. వాటిని యంత్రంతో గుండ్రని పూసలుగా తయారు చేసి, రంధ్రం చేసి, మెత్తగా పాలిష్ చేస్తారు. చివరగా వాటిని దారంలో గుచ్చి మాలలుగా తయారుచేస్తారు. పూసల పరిమాణం, రంగు, ఆకారం కస్టమర్ల అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

ఫ్యాషన్ జ్యువెలరీ

మంగలిలో తయారయ్యే ఈ పూసలు ప్రధానంగా హిందువుల జపమాలలు, ముస్లింల తస్బీహ్‌లు, సిక్కుల ప్రార్థనా మాలల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు, అలంకరణ వస్తువులు, హస్తకళ ఉత్పత్తులు, ఫ్యాషన్ జ్యువెలరీ తయారీలో కూడా వీటికి మంచి డిమాండ్ ఉంది. ఢిల్లీ, వారణాసి, హరిద్వార్, జైపూర్ వంటి నగరాలతో పాటు గల్ఫ్ దేశాలు, ఇతర విదేశాలకు కూడా ఇక్కడి ఉత్పత్తులు చేరుతున్నాయి. 

ఈ పరిశ్రమలో మహిళల పాత్ర ఎంతో కీలకం. ఇంటి పనులు పూర్తయ్యాక పూసలు దారంలో గుచ్చడం, మాలలు తయారుచేయడం వంటి పనులు చేస్తూ కుటుంబ ఆదాయాన్ని పెంచుతున్నారు. యువకులు, పెద్దలు కూడా తమకు చేతనైన పనిని చేస్తూ ఈ వృత్తిని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే మంగలిలో ఈ పని ఒక కుటుంబ వృత్తిగా తరతరాలుగా కొనసాగుతోంది. అయితే ఇక్కడి కార్మికులు ఇప్పటికీ ఎక్కువగా మధ్యవర్తులపైనే ఆధారపడుతున్నారు. దీంతో వాళ్లు తయారుచేసిన ఉత్పత్తులకు తగిన ధర దక్కడం లేదని చెప్తున్నారు. నేరుగా మార్కెట్‌కు చేరుకునే అవకాశాలు, ఆన్‌లైన్ విక్రయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే ఈ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వ్యవసాయం ఒక్కటే గ్రామీణ జీవనాధారం కాదని మంగలి నిరూపించింది. చేతివృత్తిని నమ్ముకుని, ఇంటి నుంచే ఉపాధి పొందుతూ ఒక చిన్న గ్రామం కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించగలదని ఈ ఊరు చూపించింది. చిన్న చెక్క పూసలు మంగలి ప్రజలకు కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు.. వారి నైపుణ్యానికి, కష్టానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. గ్రామీణ భారతంలో చేతివృత్తులకు ఇంకా ఎంతటి అవకాశాలున్నాయో చెప్పే స్ఫూర్తిదాయక కథగా మంగలి నిలిచిపోయింది.