‘కుడా’ ఆదాయంతో హనుమకొండలో బస్ టర్మినల్!

‘కుడా’ ఆదాయంతో హనుమకొండలో బస్ టర్మినల్!
  •  గతంలో స్మార్ట్ సిటీలో చేర్చి, తొలగించడంతో హనుమకొండ బస్టాండ్ అభివృద్ధికి దక్కని ఛాన్స్
  •  నిత్యం లక్షలాది మంది ప్రయాణాలు సాగిస్తున్నా సరైన సౌలత్ లు లేక ఇబ్బందులు
  •   ఇప్పుడు బస్టాండ్ డెవలప్ కోసం ప్రణాళిక

హనుమకొండ, వెలుగు:  ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణాకేంద్రంగా ఉన్న హనుమకొండ బస్టాండ్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. నిత్యం 1500కుపైగా బస్సులు, లక్షలాది మంది రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి కాగా.. తాజాగా హనుమకొండ బస్ టెర్మినల్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) ఇటీవల ప్లాట్లు వేలం నిర్వహిస్తుండగా.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో బస్ టెర్మినల్ పనులు చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది. దాదాపు రూ.వంద కోట్లతో పనులు చేపట్టి, కమర్షియల్ షాపుల ద్వారా ఆర్టీసీకి కూడా ఇన్ కం జనరేట్ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు తొందర్లోనే పనులు పట్టాలెక్కించేందుకు లీడర్లు, ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. 

ప్లాట్ ఫామ్స్ చాలక ఇబ్బందులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ కు హనుమకొండ బస్టాండ్ కీలకమైనది. ఇక్కడి నుంచి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తుండగా.. నిత్యం ఐదారు లక్షల మందికిపైగా రాకపోకలు సాగిస్తుంటారు. రవాణాపరంగా అంత ముఖ్యమైన ఈ బస్టాండ్ ను మొదట 1974లో అప్పటి అవసరాలకు అనుగుణంగా 9 ప్లాట్ ఫాంలతో నిర్మించారు. కానీ రవాణాపరంగా సేవలు విస్తరించే క్రమంలో పాత బస్టాండ్ పక్కనే  1990లో కొత్తగా సిటీ బస్టాండ్ ను 14 ప్లాట్ ఫాంలతో నిర్మించారు. ఆ తరువాత రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా, ఆ దిశగా డెవలప్ మెంట్ మాత్రం జరగడం లేదు. సరిపడా పార్కింగ్ సౌకర్యం కూడా లేకపోగా, వర్షాలు పడిన సమయంలో బస్టాండ్ ప్రాంగణమంతా చెరువులా మారి వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

స్మార్ట్ సిటీలో చేర్చి తీసేసిన్రు

హనుమకొండ బస్ స్టేషన్ కు ఉన్న ప్రాధాన్యం, ఇక్కడి అవసరాల దృష్ట్యా దానిని డెవలప్ చేసేందుకు అధికారులు గత ప్రభుత్వ హయాంలో  ప్రతిపాదనలు తయారు చేశారు. బస్టాండ్ ప్రాంగణం దాదాపు 13 ఎకరాల మేర విస్తరించి ఉండగా, స్మార్ట్ సిటీ పథకంలో చేర్చి డెవలప్మెంట్ కుప్లాన్ చేశారు. ఈ మేరకు రూ.వంద కోట్లతో బస్ టర్మినల్ నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదించారు. అప్పటి పాలకులు రివ్యూలు, మీటింగులు పెట్టి హడావుడి చేశారు. కానీ ఆ తరువాత దానిని పట్టించుకోకుండా  గాలికొదిలేశారు. చివరకు హనుమకొండ బస్ టర్మినల్ డెవలప్మెంట్ ను స్మార్ట్ సిటీ పథకం నుంచి తీసేశారు. ఫలితంగా హనుమకొండ బస్టాండ్ ను చాలీచాలని ప్లాట్ ఫాంలు, అరకొర సౌకర్యాలతో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. 

'కుడా'కు వచ్చే ఆదాయంతో బస్ టర్మినల్

గత పాలకులు పట్టించుకోకపోవడం, నిధుల సమస్య కారణంగా బస్ టర్మినల్ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. దీంతో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బస్ టర్మినల్ విషయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు నిధుల విషయంలో సమస్యలు తలెత్తకుండా ప్లాన్ చేశారు. 'కుడా' తాజాగా ప్లాట్లు, ఫ్లాట్లు వేలం వేస్తుండగా.. దాని ద్వారా సమకూరే ఆదాయంతో హనుమకొండ బస్ టెర్మినల్ పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచన మేరకు కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి  హనుమకొండ బస్టాండ్ డెవలప్మెంట్ విషయమై ఇదివరకే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు లేఖ అందించారు. ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో బస్ టర్మినల్​గా డెవలప్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు రూ.వంద కోట్లతో ఈ మెగా ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.

టర్మినల్ లోనే కమర్షియల్ స్పేస్ డెవలప్ చేసి, ఆర్టీసీకి ఆదాయం సమకూరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ లో రూ.75 కోట్లతో ఐదు అంతస్తులు, 32 ప్లాట్ ఫామ్స్ తో బస్ టర్మినల్ కడుతుండగా.. దాని తరహాలోనే హనుమకొండలోనూ డెవలప్ చేసేలా కసరత్తు చేస్తున్నారు. డిజిటల్ స్క్రీన్లు, ఫుడ్ కోర్టులు, ఏటీఎం సెంటర్లు, హోటళ్లు, ఇతర సదుపాయాలకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ మేరకు తొందర్లోనే హనుమకొండ బస్ టర్మినల్ కు శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఆర్టీసీకి కూడా ఇన్ కం వచ్చేలా ప్లాన్ చేస్తున్నం

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వచ్చే ఆదాయంతో హనుమకొండ బస్టాండ్ ను అభివృద్ధి చేసేలా ప్లాన్ చేశాం. దాదాపు రూ.వంద కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నాం. బస్టాండ్ ను డెవలప్ చేయడంతో పాటు దాని ద్వారా ఆర్టీసీకి కూడా ఆదాయం తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. –ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కుడా చైర్మన్

'కుడా'కు వచ్చే ఆదాయంతో నిర్మిస్తం 

గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా స్మార్ట్ సిటీ నిధులు ఉపయోగించుకోలేక హనుమకొండ బస్టాండ్ డెవలప్మెంట్ పక్కనపెట్టేశారు. ఇప్పుడు  బస్టాండ్ ను మోడ్రన్ డిజైన్ లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. కుడా ప్లాట్ల వేలం ద్వారా వచ్చే ఆదాయంతోనే పనులు చేపట్టేలా నిర్ణయం తీసుకున్నాం. బస్టాండ్ ను అత్యాధునిక వసతులతో డెవలప్ చేసి, అందుబాటులోకి తీసుకొస్తం.–నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే