రఘునాథపల్లి, వెలుగు: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నీడిగొండలో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకే పార్టీలో ఉంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటే సహించేది లేదని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
ఎస్‌ఐఆర్‌లో స్టేషన్ ఘనపూర్ ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో, రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
