రహదారులు కేవలం వాహనాల రాకపోకల కోసమే అన్నట్టు ఉన్న నేటి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు తీర్పు పాదచారులకు ఊరట ఇస్తుంది. ఈ తీర్పుతో అన్ని రహదారులపై ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా, కబ్జాలైన ఫుట్‌పాత్‌లను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో ముఖ్యంగా మహానగరం హైదరాబాద్‌లో కూడా ఫుట్‌పాత్‌లపై సుప్రీం కోర్టు ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటించాల్సిన ఆవశ్యకత ఉంది.
కోట్లాది రూపాయలతో ఎక్స్‌ప్రెస్‌వేలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రింగ్ రోడ్లు నిర్మిస్తున్న ప్రభుత్వాలు సాధారణ పౌరుడు సురక్షితంగా నడవడానికి అవసరమైన ఫుట్‌పాత్‌ల నిర్మాణం, వాటి సంరక్షణ, ఆక్రమణల నివారణ వంటి అంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పు
భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పట్టణ ప్రణాళిక, రహదారి రూపకల్పన, స్థానిక సంస్థల బాధ్యతలను ప్రభావితం చేసే విధానపరమైన మార్గదర్శకంగా కూడా. 2016లో కర్ణాటకలోని బళ్లారిలో ఐదేళ్ల బాలుడు తన తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ ఢీకొని చనిపోయిన కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(డి) కింద దేశంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఆర్టికల్ 21లోని జీవించే హక్కును విశ్లేషించింది.
ఫుట్‌పాత్‌లు వాహనాల పార్కింగ్‌కు, వ్యాపార కార్యకలాపాలకు, ఇతర అవసరాలకు కాదని అవి పూర్తిగా పాదచారుల కోసమేనని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ, ఆక్రమణల తొలగింపును నిరంతర ప్రక్రియగా చేపట్టాలని సూచించింది.
పెరగుతున్న పాదచారుల మరణాలు
చారిత్రాత్మక ఈ తీర్పుకు ప్రధాన కారణం ఏటేటా దేశంలో పెరుగుతున్న పాదచారుల ప్రమాదాలే. పదేళ్లలో పాదచారుల మరణాలు రెట్టింపు కంటే అధికంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల ప్రమాదాల తర్వాత స్థానం పాదచారుల ప్రమాదాలది రెండోస్థానం. దేశంలో 2015లో 1,46,133 రోడ్డు ప్రమాదాలు జరిగితే వాటిలో 13,894 మంది పాదచారులు మరణించారు. 2024లో 36,526 మంది పాదచారులు మరణించారు. ఏటా పాదచారుల మరణాలు పెరుగుతున్నాయని రిపోర్టులు చెపుతున్నాయి.
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలో హైదరాబాద్ టాప్
రోడ్డు ప్రమాదాలు, ఫుట్‌పాత్ ఆక్రమణలపై సుప్రీం కోర్టే కాదు. గతంలో తెలంగాణ హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించింది.
అయినా కోర్టు చుట్టుపక్కలే మార్పు రాలేదు. కోర్టు ఆదేశాల అనంతరం 7,500కు పైగా ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించినా, నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొద్ది రోజులకే మళ్లీ ఆక్రమణలు పునరావృతమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సుమారు 9,000 కిలోమీటర్లకుపైగా రహదారి నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, ఫుట్‌పాత్‌లు చాలా పరిమితంగా ఉన్నాయి.
అనేక ప్రధాన రహదారులపై ఫుట్‌పాత్‌లు లేకపోవడం, ఉన్న చోట్ల అవి వ్యాపార సంస్థలు, వీధి వ్యాపారులు, అక్రమ పార్కింగ్, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, నిర్మాణ సామగ్రి, ప్రకటన బోర్డులు, చెత్త కుప్పలతో ఆక్రమించబడటం వల్ల ప్రజలు తప్పనిసరిగా ప్రధాన రహదారులపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
గ్రేటర్ లో ప్రమాదాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో పాదచారుల ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. నగరంలో ప్రతి సంవత్సరం వెయ్యికిపైగా పాదచారుల ప్రమాదాలు నమోదవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలకు రహదారులు ప్రమాదకరంగా మారాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల గణాంకాలను పరిశీలిస్తే 2021లో 96, 2022లో 101, 2023లో 98, 2024లో 118, 2025లో 105 మంది పాదచారులు వివిధ రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.
2025లో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో లెక్కలను పరిశీలిస్తే గ్రేటర్ మొత్తంలో 580 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. హైదరాబాద్‌లో రహదారులు, ఫుట్‌పాత్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సుమారు 3 వేల కోట్ల రూపాయలు వెచ్చించి వెయ్యి కిలోమీటర్లకుపైగా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్లు, సిగ్నల్ లైట్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం నగర పాదచారులకు ఉపశమనం. ఈ పనులు వేగవంతంగా పూర్తి కావాలి.
స్పెషల్ డ్రైవ్ నత్తనడక
నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ట్రాఫిక్ సమస్యలకు, ప్రమాదాలకు కారణమవుతున్న కట్టడాలపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమైన జీహెచ్‌ఎమ్‌సీ ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని గత ఏప్రిల్ నెలలో ప్రకటించినా అది తాత్కాలికమే అయ్యింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా నగరంలో నలువైపులా కొన్ని ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను జీహెచ్‌ఎమ్‌సీ తొలగించినా పూర్తి స్థాయిలో మాత్రం చేయడం లేదు.
నిరాటంకంగా చేపట్టాల్సిన తొలగింపు ప్రక్రియను కంటితుడుపుగా అప్పుడప్పుడు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిడులతో మంచి పనులకు బ్రేకులు పడుతున్నాయి. పాతబస్తీ వంటి ప్రాంతాల్లో తొలగించిన అక్రమ కట్టడాల స్థానాల్లో ఇప్పుడు శాశ్వత నిర్మాణాలు కనిపించడం అధికార యంత్రాంగం ఒత్తిడిలకు లొంగిపోతుందని చెప్పడానికి నిదర్శనం.ఉన్నత న్యాయస్థానాలు నిరంతరం పర్యవేక్షిస్తేనే నగరంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి.
ఫుట్‌పాత్‌లపై నడవడం ప్రజల ప్రాథమిక హక్కు అనే సుప్రీంకోర్టు మైలురాయి తీర్పు కేవలం ఒక ప్రమాద కేసుపై ఇచ్చిన న్యాయ నిర్ణయం మాత్రమే కాదు. దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితంగా నడిచే హక్కు ఉందని రాజ్యాంగం కల్పించిన హామీని మరోసారి గుర్తు చేసిన చారిత్రాత్మక తీర్పు. ఇకపై ఫుట్‌పాత్‌ల నిర్మాణం, వాటి సంరక్షణ, ఆక్రమణల తొలగింపు ప్రభుత్వాల ఐచ్ఛికం కాదు. రాజ్యాంగబద్ధమైన బాధ్యత. వాహనాలకే కాదు..నడిచే మనిషికీ సమాన ప్రాధాన్యం కల్పించినప్పుడే అభివృద్ధి చెందిన నగరాలుగా నిర్మాణం సాధ్యమవుతుంది.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ
జర్నలిస్టు
గమనిక:
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
