గోదావరి, కృష్ణా బేసిన్‌‌‌‌లో వర్షాభావ  అవకాశం : అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు

గోదావరి, కృష్ణా బేసిన్‌‌‌‌లో వర్షాభావ  అవకాశం : అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు

 భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గోదావరి, కృష్ణా బేసిన్‌‌‌‌లలో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌‌‌‌లో గోదావరి వరదల సన్నద్ధతపై ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ బి. రోహిత్‌‌‌‌రాజుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వరదల నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించిన మంత్రి, ఇరిగేషన్‌‌‌‌, నేషనల్ హైవేస్‌‌‌‌, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత టెండర్లు పిలవడం ఏమిటని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా భద్రాచలంలో వరద నీరు చేరితే పనుల ప్రయోజనం ఏమిటని నిలదీశారు.ఎల్‌‌‌‌నినో ప్రభావంతో క్లౌడ్‌‌‌‌బరస్ట్​లు  సంభవించే అవకాశం ఉన్నందున   అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గోదావరి, కిన్నెరసాని పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దొంతికుంట చెరువు అభివృద్ధి పనులు, కూనవరం మార్గంలోని వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. బూర్గంపాడు–రెడ్డిగూడెం, సారపాక ప్రాంతాల్లో రోడ్ల ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరికల మేరకు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల పనులను వేగంగా పూర్తి చేయాలని, జిల్లాలో ఆయిల్‌‌‌‌పామ్ సాగును ప్రోత్సహించాలని తెలిపారు. మిర్చి పంటలో అధికంగా పురుగుల మందులు వాడటం వల్ల మార్కెట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్‌‌‌‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్   పాల్గొన్నారు. 

 నారసింహుని దయతో ప్రతీ రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలి :

 భద్రాచలం:  కల్పవృక్ష నారసింహుని దయతో ప్రతీ రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని  తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. భద్రాచలంలో కల్పవృక్ష నారసింహస్వామి దివ్యసన్నిధిలో నృసింహ ఉపాసకులు కృష్ణ చైతన్య స్వామి చేపట్టిన భూ వరాహ యాగంలో శనివారం మంత్రి పాల్గొని మాట్లాడారు. మంత్రి వెంట భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, సర్పంచ్​ పూనెం కృష్ణదొర, టీపీసీసీ జనరల్​ సెక్రటరీ నాగ సీతారాములు తదితరులు ఉన్నారు. 

కరకట్ట పనులు త్వరగా పూర్తిచేయండి

  భద్రాచలంలోని కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న కొత్త కరకట్ట పనులను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం ఇరిగేషన్‌‌‌‌, నేషనల్ హైవేస్‌‌‌‌ అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. గోదావరి వరదల నుంచి భద్రాచలాన్ని రక్షించేందుకు రూ.38 కోట్లతో కరకట్ట విస్తరణ చేపట్టినట్లు తెలిపారు. జాతీయ రహదారి వంతెన డిజైన్‌‌‌‌ ఆలస్యం కారణంగా పనులు జాప్యమయ్యాయని, ఇకపై సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రాణ, ఆస్తి నష్టాలు నివారించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.