గోల్డ్ మ్యాన్ కు 14 రోజుల రిమాండ్..చంచల్ గూడ జైలుకు తరలింపు

గోల్డ్ మ్యాన్ కు 14 రోజుల రిమాండ్..చంచల్ గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్‌లో తక్కువ ధరకే బంగారం ఇస్తానంటూ భారీ మోసాలకు పాల్పడిన  గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌కి నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు నారాయణగూడ పోలీసులు అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అసలేం జరిగిందంటే..

హయత్ నగర్‌కు చెందిన కృష్ణ చారి అనే గోల్డ్‌స్మిత్‌ (బంగారు ఆభరణాలు తయారుచేసే వ్యక్తి)ను సూర్య భాయ్ టార్గెట్ చేశాడు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. సూర్యా భాయ్ మాటలు నమ్మిన కృష్ణ చారి.. ఏకంగా రూ. 30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ క్రమంలోనే హిమాయత్ నగర్‌లోని ప్రముఖ నిలోఫర్ కేఫ్ వద్ద వీరిద్దరి మధ్య డీల్ కుదిరింది. అక్కడ కృష్ణ చారి నుండి సూర్య భాయ్ రూ. 30 లక్షల నగదు తీసుకున్నాడు. అయితే డబ్బులు చేతికి అందిన తర్వాత సూర్య భాయ్ తన అసలు రంగు బయటపెట్టాడు. రోజులు గడుస్తున్నా అటు బంగారం ఇవ్వక, ఇటు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా కృష్ణ చారిని తిప్పించుకోవడం మొదలుపెట్టాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జూన్ 27న గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు పంపారు. అయితే సూర్య భాయ్‌కి ఇలాంటి మోసాలు కొత్తేమీ కాదని పోలీసుల విచారణలో తేలింది. గతంలోనూ ఇతనిపై మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్కడ కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలను సెటిల్ చేస్తానని నమ్మించి, రూ. లక్షల్లో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సూర్య భాయ్ చేతిలో ఇంకా ఎవరైనా మోసపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.