TG20 League: టీజీ20 (TG20) లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు వరుస విజయాలతో టోర్నీలో దూసుకుపోతోంది. తాజాగా మెదక్ ఫాల్కన్స్ తో జరిగిన పోరులో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, లీగ్‌లో వరుసగా మూడో విజయాన్ని (హ్యాట్రిక్) తమ ఖాతాలో వేసుకోగా, మరోవైపు మెదక్ ఫాల్కన్స్ జట్టు మాత్రం ఆడిన 4 మ్యాచ్‌లలో మూడో మ్యాచులో కూడా ఓడిపోవడం గమనార్హం.
హైదరాబాద్ ఊచకోత:
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 240 రన్స్ చేసింది. హైదరాబాద్ ఓపెనర్లు సాయి వికాస్ రెడ్డి (48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 93 రన్స్), అభిరథ్ రెడ్డి (27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 రన్స్) మెదక్ బౌలర్లను ఉతికారేయడంతో జట్టు భారీ స్కోరు చేసేందుకు స్ట్రాంగ్ పునాది వేశారు. ఇక చివర్లో గడుగు గణేశ్ కేవలం 7 బాల్స్ లోనే 3 సిక్సర్లతో 22 రన్స్ తో అజేయంగా నిలవగా, నితిన్ నాయక్ (18), అరవింద్ (17) సహకారం అందించారు. కాగా మెదక్ బౌలర్లలో సయ్యద్ ఘాజీ అబ్బాస్, విక్రమ్ నాయక్ చెరో రెండు వికెట్లు తీయగా.. సాయి వరుణ్, కార్తికేయ, రవితేజ, అశ్విన్ రామ్ తలో వికెట్ తీసుకున్నారు.
చేతులెత్తేసిన మెదక్ బ్యాటర్లు:
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 రన్స్ మాత్రమే చేసింది. కాగా మెదక్ జట్టులో విక్రమ్ నాయక్ (42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 రన్స్) ఒంటిచేత్తో పోరాడినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. మిగతా వారిలో వరుణ్ 38, రవితేజ 31, ఇషాన్ శర్మ 27 రన్స్ చేశారు. అయితే హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ 4 వికెట్లు పడగొట్టి మెదక్ ఓటమికి బాటలు వేశాడు. ప్రణవ్ వర్మ 2 వికెట్లు తీయగా, శ్రీనికేత్, నితిన్ నాయక్ తలో వికెట్ సాధించారు.
