Prasidh Krishna: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియాకు ఐర్లాండ్ పర్యటనలో ఊహించని షాక్ తగిలింది. బెల్ఫాస్ట్‌లో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో భారత్ చారిత్రాత్మక ఓటమిని చవిచూసింది. లీగ్ మ్యాచ్‌ల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించే ఇండియా.. ఈ మ్యాచ్‌లో డెత్ ఓవర్ల వైఫల్యం కారణంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటుంది.
మ్యాచ్‌ను మలుపు తిప్పింది ఆ రెండు ఓవర్లు:
ఐర్లాండ్ ఇన్నింగ్స్ 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 118/5గా ఉంది. ఆ సమయంలో భారత జట్టుపై ఐర్లాండ్ గెలిచే అవకాశం కేవలం 19శాతం మాత్రమే ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. 16వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఐర్లాండ్ గెలుపు అవకాశాలు ఒక్కసారిగా 27 శాతానికి పెరిగిపోయాయి. ఇక 17వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. ఈ ఓవర్లలో ప్రసిద్ధ్ ఏకంగా 27 రన్స్ ఇచ్చేశాడు. ఈ ఓవర్ తర్వాత ఐర్లాండ్ విన్ ప్రాబబిలిటీ 41 శాతానికి దూసుకెళ్లింది.
చివర్లో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ కట్టడి చేసి ఐర్లాండ్ గెలుపు అవకాశాలను 31% కి తగ్గించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ పై ఆందోళన:
గాయం తర్వాత నవంబర్ 2023 (ఆస్ట్రేలియాపై 0/68) నుంచి సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి పునరాగమనం చేసిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ తన 4 ఓవర్లలో 14.25 ఎకానమీతో 57 పరుగులు ఇచ్చుకున్నాడు. వన్డేలు, టెస్టుల్లో బౌన్స్‌తో రాణించే అతడు.. టీ20ల్లో మాత్రం లెంత్ కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. యార్కర్లు వేయడంలో విఫలమై, బ్యాటర్లకు లూజ్ బాల్స్ ఇచ్చి భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఐపీఎల్‌లోనూ గత రెండు సీజన్లుగా ప్రసిద్ధ్ డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించలేక నానా ఇబ్బంది పడుతున్నాడు.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు చేదు అనుభవం:
పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు ఈ ఓటమి పెద్ద షాక్ అనే చెప్పాలి.. గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్.. డెత్ ఓవర్లలో బౌలర్ల నియంత్రణ లోపించడం వల్లే చేజారిపోయింది. డెత్ ఓవర్లలో ఒకే ఓవర్లో 27 పరుగులు రావడం అనేది మ్యాచ్ ఫలితాన్ని మార్చడమే కాకుండా, కెప్టెన్ వ్యూహాలను కూడా దెబ్బతీసింది.
జట్టులోకి ప్రిన్స్ యాదవ్:
ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఓడిన భారత్ నెక్ట్స్ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాలి.. ఈ క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీ తరఫున ఆడే ప్రిన్స్ యాదవ్, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2026 లో 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ప్రిన్స్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం కూడా చేశాడు.
