దేశంలో ఒక వ్యక్తికి ఏడాదికి రూ.85 లక్షల ప్యాకేజీ ఉందంటే.. అబ్బో ఎంత లగ్జరీ లైఫ్ బతకొచ్చో, ఎంత డబ్బు వెనకేయొచ్చో కదా అని అందరూ అనుకుంటారు. ఆకాశమంత జీతం ఉన్నా.. బెంగళూరు లాంటి మెట్రో సిటీలో అడుగుపెడితే ఆ సంపాదన కూడా ఎలా కరిగిపోతుందో చూపిస్తూ ఒక NRI షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 15 ఏళ్ల పాటు విదేశాల్లో నివసించి, తిరిగి ఇండియాకు వచ్చి నార్త్ బెంగళూరులో ఒక కొత్త ఉద్యోగంలో చేరడానికి సిద్ధమవుతున్న సదరు ఎన్నారై.. తన అంచనా నెలవారీ బడ్జెట్‌ను 'రెడిట్'లో పంచుకున్నారు. ఆ లెక్కలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
సదరు ఎన్నారైకి ఏడాదికి ఫిక్స్‌డ్ శాలరీ రూ.85 లక్షలంట. అంటే నెలకు ట్యాక్సులు అన్నీ పోను చేతికి దాదాపు రూ.4లక్షల 60వేల వరకూ జీతం వస్తుంది. నెలకు నాలుగున్నర లక్షల కంటే ఎక్కువే సంపాదిస్తున్నా.. తన నెలవారీ ఖర్చులన్నీ రాసుకుంటూ పోతే, చివరకు చేతిలో కేవలం లక్ష రూపాయలు మాత్రమే సేవింగ్స్ కోసం మిగులుతోందని వాపోయాడు. బెంగళూరులో కేవలం బతకడానికే అంటే.. ఇంటి అద్దె, పనిమనుషులు, స్కూల్ ఫీజులు, కిరాణా సరుకులకు నెలకు రూ.లక్షన్నర అవుతోందని తెలిపాడు. తన బడ్జెట్ అంచనా కరెక్టేనా.. లేక తాను ఏమైనా తప్పుగా లెక్కేశానా?" అంటూ జనాన్ని అడుగుతున్నాడు.
ఆయన షేర్ చేసిన బడ్జెట్ వివరాల ప్రకారం.. నార్త్ బెంగళూరులో 3-4 బీహెచ్‌కే ఫ్లాట్ కోసం ఇంటి అద్దెకే నెలకు రూ.70వేల నుండి రూ.90వేలు అవుతుంది. దీనికి తోడు ఒక విల్లా కోసం నెలకు రూ.35వేలు ఈఎంఐ కట్టాల్సి ఉందట. కరెంట్, వాటర్ బిల్లుల కోసం రూ.10వేలు, కార్ లీజ్ కోసం రూ.25వేల నుండి రూ.35వేలు ఖర్చవుతుంది. ఇక ఇంట్లో వంట, క్లీనింగ్ చేసే పనిమనుషుల జీతాల కోసం రూ.25వేలు, పిల్లల స్కూల్, ఇతర యాక్టివిటీస్ కోసం రూ.20వేలు, గ్రాసరీస్ కోసం రూ.30వేలు, బయట హోటళ్లలో తినడానికి మరో రూ.30వేలు కేటాయించారు. ఇవి కాకుండా షాపింగ్, ఇతర చిన్నపాటి ఖర్చులకు రూ.40వేలు, ట్రావెల్ సేవింగ్స్ కోసం రూ.25వేలు, పిల్లల కాలేజీ ఫండ్ కోసం రూ.20వేలు పక్కన పెట్టారు. ఇవన్నీ కూడితే జీతంలో సింహభాగం ఖర్చైపోయి కేవలం లక్ష రూపాయలు మాత్రమే మిగులుతోందట.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఎన్నో క్రేజీ సలహాలు ఇచ్చారు. కొందరు నెటిజన్లు.. "నువ్వు అటు భారీగా రెంట్ కడుతూ.. ఇటు విల్లా ఈఎంఐ కూడా కడుతున్నావు. రెండూ ఒకేసారి చేయడం వల్లే నీ బడ్జెట్ తలకిందులైంది" అని చెప్పారు. మరికొందరైతే.. "ఇండియాలో ప్రస్తుతం చదువు చాలా కాస్ట్లీ అయిపోయింది, పిల్లల స్కూల్ ఫీజుల కోసం నువ్వు కేటాయించిన రూ.20వేలు చాలా తక్కువ. దాన్ని కనీసం రూ.30వేలు చేయాలి" అని హెచ్చరించారు. అలాగే.. కార్ లీజ్ ఆప్షన్ అస్సలు ఎంచుకోవద్దని, ఉద్యోగం పోయి మధ్యలో క్లోజ్ చేయాల్సి వస్తే భారీగా పెనాల్టీలు పడతాయని మరికొందరు సూచించారు.
మొత్తానికి విదేశాల నుంచి వచ్చే వారు ఇండియాలో కూడా అదే లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను మెయింటైన్ చేయాలనుకుంటే.. నలుగురు ఉన్న కుటుంబానికి నెలకు రూ.4 లక్షలు ఈజీగా ఖర్చయిపోతాయని, ఎంత సంపాదించినా పెద్దగా సేవింగ్స్ మిగలవని ఈ బడ్జెట్ ఎన్ఆర్ఐ లెక్కలతో తేలిపోయింది.
