న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఇష్యూలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌పై వేటు పడనున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మోడీ సర్కార్‌ను ఇరుకున పెట్టిన ఈ అంశాన్ని ప్రదాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని కేంద్రం అతడిపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేబినెట్ నుంచి ప్రధాన్‌ను పక్కకు తప్పిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ధర్మేంద్ర ప్రధాన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించడం కొత్త చర్చకు దారి తీసింది. జూన్ 26న ధర్మేంద్ర ప్రధాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రదాన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.
‘‘కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతదేశాన్ని జ్ఞానం, అభ్యాసం, ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే జాతీయ విద్యా విధానం అమలుకు ఆయన ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు. ఆయన దీర్ఘాయువుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను’’ అని మోడీ ట్వీట్ చేశారు.
ఓ వైపు నీట్ పేపర్ లీక్ ఇష్యూతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాన్‌పై మోడీ ప్రశంసలు కురిపించడం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ప్రదాన్‌పై వస్తోన్న విమర్శలను మోడీ ఏ మాత్రం పట్టించుకోకుండా తన సహచర మంత్రి పని తీరును కొనియాడటంతో మంత్రి వర్గం నుంచి ప్రదాన్‌పై వేటు తప్పిందనడానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై క్లారిటీ రావాలంటే కేబినెట్ విస్తరణ జరిగే వరకు వెయిట్ చేయాల్సిందే..
