- ఎన్ జీ కాలేజీలో లక్ష మందితో సభ
నల్గొండ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణానికి కనగల్ లో నుంచే శంకుస్థాపన చేయనున్నారు. హ్యామ్ విధానంలో రూ.19,300 కోట్లతో 13,541 కిలోమీటర్ల పొడవైన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి దశ కింద చేపట్టనున్న పనులను కనగల్ లో ప్రారంభించి దర్వేశిపురం, గుర్రంపోడు, -మల్లేపల్లి, దేవరకొండ, -డిండి ప్రాంతాలను అనుసంధానించే రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నారు. రెండో ప్యాకేజీలో చిట్యాల, -రామన్నపేట, -వలిగొండ, -భువనగిరి, -జగదేవ్‌పూర్ మార్గాలను అభివృద్ధి చేయనుండగా, ఆలేరు ప్రాంతంలోనూ మరో రూ.300 కోట్లతో పనులు చేపట్టనున్నారు.
ఎన్జీ కాలేజీలో భారీ బహిరంగ సభ
శంకుస్థాపన అనంతరం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు లక్ష మందిని సమీకరించాలని కాంగ్రెస్ శ్రేణులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సభా వేదిక వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
కనగల్ వద్ద హ్యామ్ రోడ్లని ప్రారంభించే పైలాన్, హెలిప్యాడ్ నిర్మాణం, పార్కింగ్ వసతులు, బారికేడ్ల ఏర్పాటును కలెక్టర్, ఎస్పీ స్వయంగా పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీరు, ఎండ దెబ్బ తగలకుండా టెంట్లు, తదితర సౌకర్యాలను సిద్ధం చేశారు. సీఎం టూర్ నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వాహనాల కోసం కళాభారతి, మేకల అభినయ్ స్టేడియం, ఆర్య సమాజ్ ప్రాంగణం, రైల్వే స్టేషన్, రాక్ హిల్స్, వీటీ కాలనీ, ఎల్ వీ పెట్రోల్ బంక్, ఆర్ఆర్ఆర్, రాఘవేంద్ర కాలనీ, రవీంద్రనగర్, పోలీస్ పరేడ్ గ్రౌండ్, బీట్ మార్కెట్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
