యూటర్న్ తీసుకుంటుండగా స్కూటీని ఢీ కొట్టిన ఇన్నోవా.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

యూటర్న్ తీసుకుంటుండగా స్కూటీని ఢీ కొట్టిన ఇన్నోవా.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగిని మృతిచెందగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఇన్‌‌స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన టి.కళ్యాణి(30) హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో భర్త నరేశ్​తో కలిసి స్కూటీపై బయలుదేరింది.

బయో డైవర్సిటీ జంక్షన్ వద్ద పక్వాన్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న యూ-టర్న్ వద్ద మలుపు తిరుగుతుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. భార్యభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించగా, కళ్యాణి అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నరేశ్​తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

మరో ప్రమాదంలో టెకీ మృతి..
ముందు వెళ్తున్న వాహనదారుడు యూటర్న్ వద్ద అకస్మాత్తుగా బైక్ తిప్పడంతో వెనుక నుంచి వచ్చిన ఓ ఐటీ ఉద్యోగి అదుపుతప్పి ఢీకొని మృతి చెందాడు. గచ్చిబౌలి జేవీ కాలనీలోని ఇయర్ వ్యూ అపార్ట్‌‌మెంట్‌‌లో నివసించే అబ్బి ఆనంద్ సింగ్ (27) డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆనంద్ సింగ్ తన బైక్‌‌పై ఖాజగూడ లేక్ రోడ్డులో గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వైపు వెళ్తున్నాడు. 

ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ గేట్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్దకు చేరుకోగానే, ముందు వెళ్తున్న మరో బైకర్ ఎలాంటి సంకేతం ఇవ్వకుండానే యూటర్న్ తీసుకునేందుకు బైక్ మళ్లించాడు. దీంతో వెనుక నుంచి వచ్చిన ఆనంద్ సింగ్ బైక్ అదుపు తప్పి ముందున్న బైక్‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ సింగ్ తలకు తీవ్ర గాయాలై స్పాట్​లో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బైకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.