RSS చట్ట బద్ధత దేశ సమస్య.. అల్లావాదం లాగే బ్రాహ్మణవాదం !

RSS చట్ట బద్ధత దేశ సమస్య.. అల్లావాదం లాగే బ్రాహ్మణవాదం !

కర్నాటక హోమ్ ​మినిస్టర్​ ప్రియాంక ఖర్గే, ఆర్​ఎస్​ఎస్​ సర్​ సంఘ్​ చాలక్​ మోహన్​ భగవత్​కు రాసిన లేఖ చాలా తీవ్రమైన అంశాన్ని  దేశం ముందుంచింది. ఆర్​ఎస్​ఎస్​ కేంద్రంలోనూ, చాలా రాష్ట్రాల్లోనూ బీజేపీని అధికార పార్టీగా నడిపిస్తున్న తరుణంలో ఖర్గే దాని చట్టబద్దత, దానిపని విధానం, దాని ఆదాయ, వ్యయాల వివరాలు ఇవ్వాలని రాసి, గత వంద ఏండ్లుగా దేశ హోమ్​మంత్రులు ఎవరూ కూడా చేయని పని చేశాడు.  అసలు గత వంద ఏండ్లు ఈ ప్రశ్నలు  దేశం ముందు ఏ ప్రధానిగానీ, హోంమంత్రిగానీ ఎందుకు పెట్టలేదు?  బ్రిటిష్​ వలస కాలంలో అంటే 1947 వరకు ఈ ప్రశ్న అడగాల్సిన బాధ్యత బ్రిటిష్​ వారిది. ఐతే ఆ రోజుల్లో అది ఒక ప్రధాని, స్వతంత్ర సంఘంగా లేకపోవడం వల్ల బ్రిటిష్​వారు దాన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు.

​కానీ 1947 తరువాత​అది ఒక గుర్తింపు గల సంస్థగా దేశం భావించింది. మహాత్మాగాంధీ హత్య తరువాత దాన్ని బ్యాన్​ చేశారు. ఈ హత్య హిందూ మహాసభతో సంబంధం ఉన్న నాథూరాం గాడ్సే చేసినందున కొంత కాలం బ్యాన్​ చేయబడి తిరిగి అది బహిర్గత సంస్థగా ఎదగనారంభించింది.  ఆర్​ఎస్​ఎస్​కు హిందూ మహాసభకు ముస్లిం వ్యతిరేకత సారూప్యత ఉంది.  

హిందూ మత పునాదిగాఎదుగుతూవచ్చిన ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​కు కూడా అది అంత ప్రమాదకారిగా కనిపించలేదు. అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యే నాటికి  అది మతపర సమస్యలు ముందు పెట్టి రాజ్యాన్ని లొంగదీసుకోవడం మొదలుపెట్టింది. 

ముస్లింల మతతత్వ పేర  క్రమంగా  దాన్ని ముస్లిమేతరులకు ​ సంస్థగా మార్చింది. మతకల్లోలాలు జరిగినప్పుడు అమాయకుల మరణాలు దాని ఆక్యుపెన్సీ ని మరీ పెంచింది. అది క్రమంగాఇంటింటి ద్విజకుల సంస్థగా మారింది. అయితే, గోహత్య సమస్య తీసుకొని అది సాధులను, సన్యాసులను సమీకరించడం,  టెంపుల్​సమస్యలు దేశం ముందు పెట్టడం వల్ల దాని చట్టబద్దస్టేటస్​పై ఏ ప్రధానమంత్రి, హోమ్​మంత్రి అడగలేదు. దాని డబ్బు సమీకరణపై ఏ ఫైనాన్స్​ మినిస్టర్​ దాని బ్యాంకు ఎకౌంట్ల గురించి ప్రశ్నించలేదు. అసలు  ఇది దేశ సమస్యగా మారుతుందని గతపాలకులు భావించలేదు. అయితే ఏ చట్టబద్దతలేని అన్నిసంస్థల్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఇరకాటంలో పెడుతూ నిర్బంధం విధిస్తూ వచ్చినపుడు, ఆర్​ఎస్​ఎస్​ను  మాత్రంఎందుకు అంత ప్రేమతో చూశాయి?

 కుల కోణం ఉందా?

ఒక దళిత రాష్ట్ర హోమ్​మంత్రి ఖర్గే ఆర్​ఎస్​ఎస్​ లీగల్​ స్టేటస్​ సమస్య లేవనెత్తే వరకు ఏ రాష్ట్రంలోగానీ, దేశస్థాయిలోగానీ ఈ ప్రశ్న ఎందుకు తలెత్తలేదు? దేశంలో స్పష్టంగా తెలిసిన విషయం ఆర్​ఎస్​ఎస్​ మొదటి నుంచీ బ్రాహ్మణుల నాయకత్వంలో నడుస్తున్న సంస్థ అని. మొదట్లో దేశంలో అతి పెద్దవ్యాపార కమ్యూనిటీగా ఉన్న కోమట్లతో  (వైశ్యులతో)  దానికో వైరుధ్యముండింది.  

కానీ గాంధీని విశ్వహిందూపరిషత్​తో సంబంధమున్న నాథూరాం గాడ్సే చంపాక ఆర్​ఎస్​ఎస్​ను కూడా బ్యాన్​ చేసింది నెహ్రూ ప్రభుత్వం. కానీ కాలక్రమేణా బ్రాహ్మణ – వైశ్య కులాల మధ్య చాలా సయోధ్య  ఏర్పడింది. మతం చుట్టూ, ముస్లింల సమస్య చుట్టూ ఏర్పడింది.

 వైశ్యులకు ముస్లిం వ్యాపారులతో కూడా తీవ్రమైన వైరుధ్యముండింది. ఆర్​ఎస్​ఎస్​ ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని  చూశాక వైశ్యులు ఆర్​ఎస్​ఎస్​కు బాగా మద్దతు పెంచారు. ఈ రెండు కులాలు దేశరాజకీయ వ్యవస్థ ను కూడా శాసించడం మొదలుపెట్టాయి. వైశ్య కమ్యూనిటీ క్రమంగా ఆర్​ఎస్​ఎస్​ బ్యాంక్​గా మారింది.

 ఏ ప్రభుత్వమూ ఆర్​ఎస్​ఎస్​  లీగల్​ స్టేటస్​ పట్టించుకోలే!

శూద్రులకు, దళితులకు, ఆదివాసులకు అందులో నాయకత్వ స్థానంలేదు. అది ఉన్నట్టు కనిపించినా నిజం లేదు.  అది నామమాత్రపుది. బహుశా అందుకే అనుకుంటా నెహ్రూ నుంచి పీవీ నర్సింహరావు వరకు దాని లీగల్​ స్టేటస్​ ప్రశ్న తలెత్తలేదు. ఆ ప్రశ్న అడగడానికి ఏ ప్రధానమంత్రి, హోమ్​మంత్రి ఢిల్లీలో సాహసించలేదు.

 యూపీఏ 10 సంవత్సరాల పాలనలో చిదంబరం కీలక పాత్ర పోషించాడు. ఆయన అన్ని ఎన్జీవోలను నిలదీశాడు. 5 సంవత్సరాలకొకసారి వారి ఎఫ్​సీఆర్ఏను రివ్యూ చేయాలని శాసించాడు. కానీ ఆర్​ఎస్​ఎస్​ను మాత్రం టాక్స్​ కడుతున్నారా అని కూడా అడగలేదు. దానికి విదేశాల నుంచి డబ్బు వస్తుందా, వస్తే ఎఫ్​సీఆర్​ఏ లేకుండా ఎలా వస్తుందో చూడలేదు. క్రమంగా అది 2014 లో మోదీని ముందు పెట్టి తమ నిర్మాణమైన బీజేపీ చేతుల్లోకి అధికారం తెచ్చింది. 

ఇప్పుడది చట్టబద్దత లేకపోయినా అన్ని సంస్థల్ని, అన్ని వింగ్​ల అధికార యంత్రాంగాల్ని తన కనుసన్నల్లో నడుపుతుంది. కానీ మేము చట్టపరంగా రిజిష్టర్​ చేసుకోము, మేము హిందూ మతంతో సమానం, మేము టాక్స్​లు కట్టం, మేం దేనికీ పర్మిషన్లు తీసుకోము అంటే అర్థమేమిటి? దీని అర్థమేమిటంటే, ముస్లిం దేశాల్లో లాగా మేము అల్లాకే ఆన్సరబుల్​ కానీ దేనికి కాదు అని చెప్పడంలాంటిది. 

అల్లావాదం లాగే బ్రాహ్మణవాదం!

బ్రిటిష్​వాళ్లు రాకముందు, ముఖ్యంగా 1935 యాక్ట్​ ముందు అస్సలు చట్టం అనే పదం మన ప్రజలకు తెలయదు.  ముస్లిం రాజుల కాలంలో వారికి మాత్రమే అధికార బలముండే. అది ఖురాన్​ పునాది గల వ్యవస్థ.  ముస్లిమేతరులకు ముఖ్యంగా శూద్రులకు, దళితులకు, ఆదివాసులకు ముస్లిం అధికారుల మాటే చట్టం. అలాగే, ఇప్పుడు ఆర్​ఎస్​ఎస్​ మాటే చట్టం. ఇప్పుడు ఆర్​ఎస్​ఎస్​ కూడా మోహన్​ భగవత్​ మాటే చట్టం అంటుంది. 

ముస్లింరాజుల కాల చట్టరహిత వ్యవస్థలో మతమొక్కటే ఉంటే, ఆర్​ఎస్​ఎస్​ ఆలోచనల్లో మతం–కులం సమీకృతం చేసి, కుల ఆధిపత్యంలో వ్యవస్థను నడుపడం ఉంది. ఒక్క ప్రియాంక ఖర్గే మాత్రమే కాదు మొత్తం శూద్రులు– కర్నాటకలోని లింగాయత్​లు, వక్కలిగలు, మిగతా వ్యవసాయ కులాలు, ఆర్టీజన్​ కులాలు–దళితులు, ఆదివాసులు  ఆర్​ఎస్​ఎస్​, బీజేపీలో ఉన్నా.. బయట ఉన్నా , సర్​ సంఘ్​ సంచాలక్– అంటే హెడ్గేవార్​ దగ్గరి నుంచి మోహన్​భగవత్​ల మాట చట్టం, ఇంకో చట్టం మాకు లేదు అని భావించాలి. అలా చెప్పడంలో జాతీయవాదం లేదు. అది కేవలం బ్రాహ్మణవాదం. ఈదేశంలో బ్రాహ్మణవాదం ఇస్లామిక్​ దేశాల్లో అల్లావాదం లాంటిది. అంటే ఖురాన్​వాదం అన్నమాట. ఇక్కడ బ్రాహ్మణవాదమంటే మనుధర్మ వాదమన్నమాట. 

చాలా సంస్థలను లేకుండాచేశారు,  ఆర్​ఎస్​ఎస్​ను మాత్రం గౌరవంగా చూస్తున్నారు

మనువు చాలా స్పష్టంగా బ్రాహ్మణ గురువు మాటను మించిన చట్టం లేదన్నాడు. అందులో శూద్రులకు, దళితులకు ఎక్కడ ఉంటుంది? తాత్కాలికంగా వారు అందులో పనిచేసేవారిని నమ్మించవచ్చు. ఆర్థిక అవకాశాలివ్వవచ్చు. చిన్న పదవులు ఇవ్వవచ్చు. కానీ అంతిమంగా శూద్రులను, దళితులను, ఆదివాసులను, ప్రాచీన స్థితికి తీసుకుపోవడమే దాని లక్ష్యం. ఆ లక్ష్యం దీర్ఘకాలికమైంది. 

100 ఏండ్లు ఆర్​ఎస్​ఎస్​లో ఉన్న పండిత శక్తులు, ఇతర పార్టీల్లో ఉన్న పండితశక్తులు 1949లో అమలులోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్​ చేసుకోవాలని ఆర్​ఎస్​ఎస్​ను అడగలేదు. దాని అర్థమేమిటి?   దాని మొదటి 100 ఏండ్ల చరిత్ర ఇది, మరో 100 ఏండ్లలో ఏమైతుంది? మంత్రులు, అధికారులు వారి సిద్ధాంతాన్ని నమ్మారు.

 చట్టపరంగా రిజిస్ట్రేషన్​​లేకుండా పనిచేసిన సంస్థలను ఏ ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయో, ఎలా మూసేశాయో మనం చూశాం. చాలా సంస్థల్లోని నాయకులను కార్యకర్తలను చంపేశారు కూడా.  కానీ ఆర్​ఎస్​ఎస్​ను మాత్రం  అన్ని ప్రభుత్వాలు గౌరవప్రదంగా చూశాయి. ఇప్పుడైతే అదే దేశాన్ని నడుపుతున్నది. 

రానున్న వందేండ్లలో ఏం జరగనుంది?

మేం రిజిస్టర్​ చేసుకోము, ఇన్కమ్​ టాక్స్​ అనేది మా ఖర్చులకు వర్తించదు అని ఆర్ఎసెస్ బాహాటంగా చెబుతున్నది.  కేంద్రంలోని మోదీ, అమిత్​షా దాన్ని ఒక్క ప్రశ్న కూడా అడగలేరు.  అది అధికారంలో ఉండమన్నంత కాలం వాళ్లు ఉండగలరు.  నరేంద్రమోదీతను ఓబీసీనని నమ్మించి కొన్ని ఓట్లు సంపాదించాడు. అది కలిసొచ్చింది.  మేమూ ఓబీసీలకు అనుకూలమే అని ఆర్​ఎస్​ఎస్​ చెప్పింది. కానీ అది ఉత్తమాట.  రానున్న వంద ఏండ్లలో ఆర్​ఎస్​ఎస్​ శూద్ర, దళిత, ఆదివాసులను ఏ స్థితికి నెడుతుందో ఊహించడానికి.. మేము చట్టాతీతులమని చేసిన ప్రకటన కొంత ఆస్కారమిచ్చింది.

ప్రియాంక్​ ఖర్గే ధైర్యానికి కారణం అంబేద్కరే

ఒక దళితుడు మా చట్టబద్దతను ప్రశ్నించుడేందని చెప్పడంతో భవిష్యత్తులో కుల రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో ఊహించవచ్చు.  ఐనా ప్రియాంక్​ ఖర్గే నిలకడగా ఉన్న నీళ్లలో ఒక రాయి వేసి కదిలించినట్లు చేశాడు. ఆ ధైర్యం ఆయనకు అంబేద్కర్​ నుంచి వచ్చింది. ఆయన చైతన్యం భవిష్యత్​తరాలకు ఒక ఆశను కలిగించింది.

 అయితే శూద్రులు అంబేద్కర్​ మమాత్మా పూలే చైతన్యంతో రాజ్యాంగాన్ని కాపాడుకోనంత కాలం ఆర్​ఎస్​ఎస్​ ఏది చెబితే అది  నడుస్తుంది.  దాని నడవడిని మార్చగల శక్తి కేవలం శూద్రకులాలకు మాత్రమే ఉంది.  అవి కుల పునాదిగా  దాన్ని నిలేయనంతకాలం అది తన చట్టాతీత జీవనాన్ని కొనసాగిస్తుంది.  వర్ణ వ్యవస్థలో అతిపైన ఉన్న బ్రాహ్మణ వర్ణం అందరికి సమానంగా వర్తించే చట్టాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు.  అలా అంగీకరిస్తే అసలు కులవ్యవస్థ ఇంత కాలం బతికి ఉండేదికాదు.  సరిగ్గా ఆర్​ఎస్​ఎస్​ ఇప్పుడు బాహాటంగానే మేం చెప్పేదే చట్టం అంటుంది. ఈ వాదన దళిత, ఆదివాసీ, శూద్ర కులాలకు ఎంతో పెద్ద హెచ్చరిక.

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీopenpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​-