గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడు మాయమైంది. రామగుండం భద్రిపల్లి గ్రామానికి చెందిన దాసరి రాజమ్మను షుగర్ లెవెల్స్ తగ్గడంతో సోమవారం గోదావరిఖని జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. డాక్టర్ల సూచన మేరకు సీటీ స్కాన్ చేయించేందుకు తీసుకెళ్లగా.. ఆ సమయంలో పుస్తెలతాడును తీసి కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అనంతరం ఈసీజీ కోసం మరో విభాగానికి తరలించగా పుస్తెలతాడు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈసీజీ గదిలో ఆభరణాలు తెగి కింద కనిపించాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు ఆస్పత్రి సిబ్బంది, అధికారులు, కుటుంబ సభ్యులను విచారించినట్లు సమాచారం. ఇదే ఆస్పత్రిలో గతంలోనూ ఓ పేషెంట్ బంగారు గొలుసు మాయమైనట్లు సమాచారం.
