హైదరాబాద్, వెలుగు: ఐటీ సేవలు అందించే హైదరాబాద్ కంపెనీ స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ ఆర్థిక సంవత్సరం 2027 మొదటి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఏఐ, బ్లాక్‌చెయిన్, డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఈ క్వార్టర్ రెవెన్యూ దాదాపు 97.13 శాతం పెరిగి రూ.392.42 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.199.07 కోట్లు వచ్చాయి. నికర లాభం రూ.36.92 కోట్లకు చేరుకుంది.
గత ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.18.30 కోట్లుగా ఉంది. తాజా క్వార్టర్లో హెడెరా భాగస్వామ్యంతో బిల్స్ ఆన్ చైన్ లాంచ్ చేసింది. ఇన్వాయిస్‌లు, రసీదులను బ్లాక్‌చెయిన్ రికార్డులుగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్షియల్ అప్లికేషన్లకు ఇది ఎంతో కీలకం కానుంది. ఏఐ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలను ఏకం చేస్తూ భవిష్యత్ ఆర్థిక రంగానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎండీ గణేష్ మీనవల్లి తెలిపారు.
