హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రామ, రెవెన్యూ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లు, ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన తర్వాతే ఈదులకుంట చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్లు హైడ్రా శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్ 7లో ఉన్న 6.05 ఎకరాల ఈదులకుంటతో పాటు, సర్వే నంబర్ 11/37/‘ఎ’లోని 5.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని రెవెన్యూ అధికారులు లేఖలు రాయడంతోనే మే 26న అక్కడ ఫెన్సింగ్ వేసినట్లు తెలిపింది.
ఈ భూముల్లో హైడ్రా వేసిన కంచెను తొలగించాలని మే 29న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, తాము కోర్టుకు వెళ్లలేదంటూ వస్తున్న వార్తలను హైడ్రా ఖండించింది. ఈ నెల 2వ తేదీనే కోర్టును ఆశ్రయించి వాస్తవాలను వెల్లడించినట్లు స్పష్టం చేసింది.
