మెతుకు సీమలో పర్యాటక అభివృద్ధికి అడుగులు.. దర్శనీయ స్థలాల అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు

మెతుకు సీమలో పర్యాటక అభివృద్ధికి అడుగులు.. దర్శనీయ స్థలాల అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు
  • రాష్ట్ర టూరిజం స్పెషల్​ సెక్రటరీ ద్వారా టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు కలెక్టర్​ కృషి
  • మెతుకుసీమ వైభవం ప్రపంచానికి తెలిసేలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం

మెదక్, వెలుగు: మెతుకుసీమలో పర్యాటక అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. కలెక్టర్​ ప్రత్యేక చొరవతో జిల్లాలోని వివిధ దర్శనీయ స్థలాల అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరయ్యాయి.  రాష్ట్ర టూరిజం స్పెషల్​ సెక్రటరీ, జిల్లా ప్రజాపాలన ప్రగతి పాలన స్పెషల్​ ఆఫీసర్​ వాణి ప్రసాద్​ సహకారంతో టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు కలెక్టర్​ కృషి చేస్తున్నారు. మెతుకుసీమ వైభవం ప్రపంచానికి తెలిసేలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.

ఘనమైన చారిత్ర..
మెదక్ జిల్లాకు ఘనమైన చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అత్యద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో నిర్మించిన ఉన్న పురాతన కోటలు, మెట్ల బావులు, కమాన్ లు తదితర కట్టడాలు, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే అభయారణ్యాలు, అర్బన్ పార్కులు, అనేక చోట్ల ఆదిమానవులు నివసించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆయా ప్రదేశాలకు సరైన గుర్తింపు లేక, ప్రాధాన్యత కోల్పోతున్నాయి. 

నిర్వహణ కొరవడి అధ్వానంగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రతిమాసింగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు, చరిత్ర పరిశోధకుల ద్వారా సందర్శన స్థలాలకు ప్రకారం కల్పించడంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, స్థానిక సంస్థల సహకారంతో ఆయా ప్రాంతాల్లో  శ్రమదాన కార్యక్రమాలు చేపట్టి సందర్శనకు వీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. 

రీల్స్తో ప్రచారం.. 
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలు, చారిత్రక కట్టడాలు, మెట్ల బావులు, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ఆహ్లాదకర అటవీ ప్రాంతాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించేలా సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లు, చరిత్ర పరిశోధకులు రీల్స్​ రూపొందించాలని కలెక్టర్​ సూచించారు.  ప్రస్తుత జనరేషన్​లో రీల్స్​ కు ఫాలోయింగ్​ ఎక్కువగా ఉన్నందున జిల్లాలో దర్శనీయ స్థలాల ప్రాముఖ్యత, ప్రత్యేకతలు అందరికీ తెలిసేలా రీల్స్​ రూపొందించి  ఇన్​స్టాగ్రామ్, ఫేస్​ బుక్​, వాట్సప్​ తదితర సోషల్​ మీడియా ప్లాట్​ ఫామ్​ల ద్వారా ప్రచారం కల్పిస్తే  ఆయా ప్రాంతాలకు సందర్శకుల రాక పెరుగుతుందని సూచిస్తున్నారు.  

సందర్శనకుల వీలుగా ఏర్పాట్లు.. 
నిర్వహణ లేక పోవడంతో ఆయా చారిత్రక ప్రదేశాలు, చారిత్రక కట్టడాల వద్ద చెట్ల పొదలు పెరిగి, నిర్వహణ కొరవడి రూపుకోల్పోయాయి. ఈ నేపథ్యంలో యువజన సంఘాలు, ప్రభుత్వ జూనియర్​, డిగ్రీ కాలేజీల్లోని ఎన్​ ఎస్​ఎస్​ యూనిట్ల ద్వారా, స్థానిక సంస్థల సహకారంతో ఆయా చోట్ల చెత్తా చెదారం, ముళ్ల పొదలు తొలగించి శుభ్రం చేయించి, సందర్శకులు వెళ్లేందుకు వీలుగా తయారు చేయడంపై కలెక్టర్​ దృష్టి పెట్టారు. 

రానున్న వానాకాలంలో ఆయా చోట్ల మొక్కలు నాటించి పచ్చదనాన్ని పెంపొందించాలని నిర్ణయించారు. సందర్శకుల సౌకర్యార్థం స్నాక్స్, వాటర్​ బాటిల్స్ అమ్మే స్టాల్స్​  ఏర్పాటు చేయించే ఆలోచనలో ఉన్నారు. మెతుకు సీమలోని చారిత్రక ప్రదేశాలు, అద్భుత కట్టడాలు, ప్రముఖ ఆలయాలు, ఆహ్లాదకర ప్రదేశాలు, ప్రముఖుల జీవిత విశేషాలతో ఒక బుక్​ లెట్​ రూపొందించి ముద్రించాలని కలెక్టర్​ నిర్ణయించారు. 

టూరిజం ​సర్క్యూట్..​
రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ముఖ్యంగా జిల్లా సమీపంలో ఉన్న హైదరాబాద్​, - సికింద్రాబాద్​ జంట నగరాల నుంచి సందర్శకులు, భక్తులు, ప్రకృతి ప్రేమికులు మెదక్ జిల్లాలోని నర్సాపూర్​ అర్బన్​ ఫారెస్ట్​, కొల్చారం జైన మందిరం, ఏడుపాయల, మెదక్ ఖిల్లా, మెదక్ కెథడ్రల్​ చర్చి, పోచారం అభయారణ్యం సందర్శించేందుకు వీలుగా టూరిజం సర్క్యూట్​ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 

ఆయా ప్రాంతాల విశేషాలను, పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  జిల్లా స్పెషల్​ ఆఫీసర్​ గా నియమితులైన రాష్ట్ర టూరిజం స్పెషల్​ సెక్రటరీ వాణి ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. ఇటీవల మెదక్ ఖిల్లాను సందర్శించిన వాణి ప్రసాద్​ జిల్లాలోని దర్శనీయ స్థలాలను సందర్శించేందుకు వీలుగా టూరిజం సర్క్యూట్​ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మెదక్ ఖిల్లా, కెథడ్రల్​ చర్చి.. ఇలా ఎన్నెన్నో..  
* జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణంలో కాకతీయ రెండో ప్రతాప రుద్రుడు నిర్మించిన మెదక్ ఖిల్లా,  వందేండ్ల కిందట నిర్మితమై ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద దైన కెథడ్రల్​ చర్చి ఉంది. 
* పాపన్నపేట మండల పరిధిలో వనదుర్గా భవాని మాత కొలువైన, సర్పయాగ స్థల ప్రాశస్తి కలిగిన ఏడుపాయల ఉంది. 
* వరంగల్​ జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని పోలిన టేక్మాల్​ మండలం వేల్పుగొండలోని తుంబురేశ్వరాలయం ఎంతో ఆకట్టుకుంటుంది. 
* మండల కేంద్రమైన కొల్చారంలో 23వ జైన తీర్థంకరుడు పార్శ్వీనాథుడు కొలువైన జైన మందిరం ఉంది. 
* మండల కేంద్రమైన పాపన్నపేట, కొల్చారం మండలం రంగంపేట, కౌడిపల్లి మండలం వెంకట్రావ్​ పేట, వెల్మకన్న, చిన్నశంకరంపేట మండలం చందంపేటలో నిజాం కాలంలో  సంస్థానాధీశులు నిర్మించిన కోటలు దర్శనమిస్తాయి. 
* మండల కేంద్రమైన వెల్దుర్తిలో కాకతీయుల కళాతోరణం, ఇదే మండలం మన్నెవారి జలాల్​ పూర్​ లో, మెదక్ పట్టణ పరిధి దాయర వీధిలో మెట్ల బావులు,  మెదక్ పట్టణ శివారులో హల్దీవాగు మీద అడ్డంగా నిర్మించిన బారా కమాన్ కనిపిస్తుంది. 
* చిన్నశంకరంపేట, నిజాంపేట మండలం తిప్పనగుల్లలో పురాతన శివాలయం, హవేలి ఘనపూర్​, కొల్చారం, పాపన్నపేట, వెల్దుర్తి తదితర మండలాల పరిధిలో ఆదిమానవుల కాలం నాటి రాతి చిత్రాలు కనిపిస్తాయి. 
* హవేలి ఘనపూర్​ మండల పరిధిలో పోచారం అభయారణ్యం, నర్సాపూర్​ సమీపంలో అర్బన్​ పార్క్​ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.