సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి.. ఏడుగురికి సీరియస్

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి.. ఏడుగురికి సీరియస్
  • మరో ఏడుగురికి గాయాలు
  •     మృతులంతా కర్నాటక వాసులే
  •     సత్వార్‌‌ వద్ద  ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ ట్యాంకర్
  •     అదే జిల్లా కోహిర్ చౌరస్తాలో మరో యాక్సిడెంట్..ఇద్దరు మృతి

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జహీరాబాద్‌ మండలం మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో 65వ నేషనల్ హైవేపై ఆటోను లారీ ట్యాంకర్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పొట్టకూటి కోసం కర్నాటక నుంచి వలస వచ్చిన ఐదుగురు రోజువారీ కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. గాయాలతో మరో ఏడుగురు కూలీలు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 పోలీసుల ప్రకారం..కర్నాటకలోని రాజిగిరి గ్రామానికి చెందిన 12 మంది కూలీలు ఉపాధి కోసం జహీరాబాద్‌కు వచ్చారు. వీరంతా జహీరాబాద్ శాంతినగర్‌లోని భవన నిర్మాణ పనులు ముగించుకుని మంగళవారం రాత్రి ట్రాలీ ఆటోలో తమ సొంతూరికి బయలుదేరారు. సత్వార్ వద్దకు రాగానే.. వీరు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి లారీ ట్యాంకర్ వేగంగా ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న రేఖ (24), శ్రీదేవి (28), దేవదాస్ (45), కవిత (34), రేష్మ (26) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.ఇదే ఆటోలో ప్రయాణిస్తున్న నిర్మల, నికిత, తుల్జమ్మ, చంద్రకళ, రాధిక, శిల్పా, శోభ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని వెంటనే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 చికిత్స పొందుతున్నవారిలో  ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు కోరడంతో బాధితులను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మంత్రి దిగ్భ్రాంతి

ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన  వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, సంగారెడ్డి డీఎంహెచ్‌వోను మంత్రి ఆదేశించారు.  

మరో ఘటనలో ఇద్దరు..

సంగారెడ్డి జిల్లాలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కోహిర్ చౌరస్తా సమీపంలో మంగళవారం రాత్రి ఓ కారు  రోడ్డుపై పల్టీలు కొట్టి ఎగిరిపడగా వెనకాల ప్రయాణిస్తున్న మూడు కార్లు ఒకదాని వెనుక మరొకటి  ఢీకొన్నాయి. ఈ ఘటనలో పల్టీలు కొట్టిన కారులోని ఇద్దరు చనిపోయారు. మృతులను సదాశివపేట పట్టణం 1వ  వార్డుకు చెందిన బోడగమా మల్లికార్జున్(52) ,శంకర్ (52)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.