హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేటలో శనివారం హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. సర్వే నంబర్1లో ఉన్న పదెకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. రెవెన్యూ అధికారుల లేఖ మేరకు హైడ్రా ఈ భూములను కాపాడింది. మార్కెట్లో దీని విలువ రూ.750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ సర్వే నంబర్ 1లో మొత్తం 108 ఎకరాలుండగా ఇప్పటికే 98 ఎకరాలు కబ్జాకు గురైంది.
ఇప్పటికే నివాసాలు ఉంటున్న ఇండ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో, భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా ఫెన్సింగ్ వేసింది. 10 ఎకరాల్లో ప్రీకాస్ట్ ఇటుకలతో కబ్జాదారులు ప్రహరీలు నిర్మించి ఆక్రమణలకు పాల్పడ్డారు. కొన్ని ప్రహరీల్లో చిన్న గదులు నిర్మించారు. కాంపౌండ్లు నిర్మించి తాత్కాలిక షెడ్లు వేసి ఆక్రమణలకు పాల్పడిన కబ్జాదారులు, వారి సొంత మనుషులను కాపలాకు ఉంచారు. ప్రీకాస్ట్ వాల్స్‌తో పాటు తాత్కాలికంగా వేసిన షెడ్లను హైడ్రా తొలగించింది. మున్ముందు ఆక్రమణకు ఆస్కారం లేకుండా మొత్తం భూమికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేసింది.
